పులుసులో ములక్కాయలా మారిన మాజీ సీఎం

Update: 2017-01-24 09:33 GMT
కాలం మహా చిత్రమైనది. ఆకాశానికి ఎత్తేసే రోజులున్నట్లే.. అధ:పాతాళానికి పడగొట్టే రోజులు కొందరికి ఉంటాయి. అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత.. ఢిల్లీ రాష్ట్రానికి తిరుగులేని విధంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షీలాదీక్షిత్. అరవింద్ కేజ్రీవాల్ పుణ్యమా అని ఢిల్లీ సీఎం పదవి తర్వాత.. ఎమ్మెల్యేగా గెలవలేని దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్న షీలా దీక్షిత్ కు.. తాజాగా మరో అవమానం ఎదురైంది.

తన మానాన తాను ఉంటున్న వేళ.. యూపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిందిగా అధినాయకత్వం ఆదేశించటంతో ఆమెకు పెద్దగా ఇష్టం లేకున్నా.. ఓకే అనక తప్పలేదు. పోల్ మేనేజ్ మెంట్ లో మొనగాడిగా పేరున్న ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగి.. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను సగర్వంగా ఎగురవేస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన మాటలకు మొదట ఓకే అనేశారు.

ఇందులో భాగంగా ఆయన సూచించినట్లుగా ఊరికి ముందే.. యూపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలాదీక్షిత్ ను ప్రకటించారు. దీనిపై విస్మయంతో పాటు పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా.. యూపీ అధికారపక్షానికి.. కాంగ్రెస్ కు మధ్య కుదిరిన పొత్తు కారణంగా.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి నుంచి షీలా దీక్షిత్ పక్కకు తప్పుకున్నారు.

రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన చర్చలు మొదలైన వేళలో.. షీలమ్మ మీడియా ముందుకు వచ్చేసి.. తాను పక్కకు తప్పుకోనున్నట్లుగా వెల్లడించారు. ఒక రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉండరు కదా? అన్న వ్యాఖ్యలు ఆమె చెప్పటం బాగానే ఉన్నా.. ఆమెను అనవసరంగా బలిపశువును చేశారన్న విమర్శ వ్యక్తమవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఏదో చేస్తానని చెప్పిన ప్రశాంత్ కిశోర్ పత్తా లేకుండా పోవటం.. ఉత్తరాఖండ్ కు తన బిచాణానుషిఫ్ట్ చేసుకోవటం చూస్తే.. పులుసులో ములక్కాయలా షీలమ్మ మారారని చెప్పక తప్పదు. తిరులేని విధంగా ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పలుమార్లు వ్యవహరించిన షీలాదీక్షిత్ కు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి అంటే.. అది కాల మహిమగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News