కొత్త నేతను ప్రకటిస్తారా ?

Update: 2021-11-21 05:30 GMT
‘నాకు కొత్తగా పదవి ఏమీ అవసరంలేదు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక కూడా ఏమీలేదు’.. ఇది చంద్రబాబునాయుడు చేసిన, చెబుతున్న మాటలు. అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానంటు శపథం కూడా చేశారు.

నిజానికి రెండు ప్రకటనల్లోను పరస్పర విరుద్ధమైన అంశాలుండటం అందరు గమనించాలి. ఒకసారేమో తనకు కొత్తగా పదవులు అవసరం లేదని, ముఖ్యమంత్రవ్వాలనే కోరిక ఏమీ లేదని అంటునే మళ్ళీ సీఎంగా మాత్రమే సభలో అడుగుపెడతానని శపథం చేయటాన్ని ఏమనాలి ?

మొదటినుండి చంద్రబాబు ఇదే పద్దతిలో నడుస్తున్నారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుంటారు. సరే చంద్రబాబులో కన్ఫ్యూజన్ను వదిలేస్తే పార్టీకి కొత్త నేతను ఏమైనా ప్రకటించబోతున్నారా ? అనే సందేహం జనాల్లో మొదలైంది. పదవుల గురించి చంద్రబాబు చేసిన ప్రకటన నిజమే అయితే తొందరలోనే పార్టీకి కొత్త నేతను ప్రకటించాలి. ఆ కొత్తనేత లోకేషా లేకపోతే మరెవరిని అయినా ఎంపిక చేస్తారా అన్నది చంద్రబాబు సమస్య.

ఇప్పటికిప్పుడు పార్టీలో ఉత్తేజం నింపేందుకు సరైన నేత లేరన్నది వాస్తవం. గడచిన రెండున్నర ఏళ్ళుగా పార్టీలో జవసత్వాలు నింపటానికి చంద్రబాబు వల్లే కావటంలేదు.

అందుకనే ప్రతిఎన్నికలోను టీడీపీకి భంగపాటే ఎదురవుతోంది. ఒకవైపేమో జనాలంతా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉంటారని ఊరూవాడ అదిరిపోయేట్లు గోల చేస్తున్నారు. ఎన్నికలు జరిగితేనేమో జనాలు వైసీపీకే ఓట్లేస్తున్నారు. ఈ విషయంలోనే చంద్రబాబు అండ్ కో ఎంతటి అయోమయంలో ఉందో అర్ధమైపోతోంది.

జనాల నాడిని పట్టుకోవటం కూడా చంద్రబాబు అండ్ కో కు అర్ధం కావటంలేదు. నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలుంటే ఓట్లన్నీ టీడీపీకే పడాలికదా. కానీ అలా పడటంలేదంటే అర్ధమేంటి ? చంద్రబాబు అండ్ కో చెబుతున్నట్లుగా జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే కదా. ఎంతసేపు మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై బురదచల్లేయటం లేకపోతే తన మద్దతు మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయించటంతోనే సరిపోతోంది.

ఇప్పటికైనా పార్టీ నేతలను, శ్రేణులను ముందుండి నడిపించే గట్టి నేతను చంద్రబాబు ప్రకటిస్తే పార్టీ రాత మారుతుందేమో చూడాలి. జనాల్లో విస్తృతంగా తిరిగేంత ఓపిక చంద్రబాబులో లేదు. కాబట్టి మీడియా సమావేశంలో తానే చెప్పినట్లుగా ఎవరికైనా నాయకత్వాన్ని అప్పగిస్తే వాళ్ళైనా జనాల్లో బాగా తిరుగుతారేమో చూడాలి. పార్టీ బలోపేతమవ్వాలంటే నేతలు ఉండాల్సింది జనాల్లోనే కానీ పార్టీ కార్యాలయాల్లోనో లేకపోతే మీడియా సమావేశాల్లోనో కాదని చంద్రబాబు అండ్ కో గ్రహిస్తే మంచిది.


Tags:    

Similar News