బీజేపీని ఓడించ‌టానికి ఆయ‌నొక్క‌రు చాలు!

Update: 2019-03-12 04:49 GMT
అధికారం సొంతం కావాల‌ని అంద‌రికి ఉంటుంది. అందుకు చాలానే ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ.. వాటిని బ‌య‌ట‌కు చెప్పే ప్ర‌య‌త్నం ఎవ‌రూ చేయ‌రు. అయితే.. క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి.. బీజేపీ సీనియ‌ర్ నేత య‌డ్యూర‌ప్ప వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొన్న‌టికి మొన్న పాక్ మీద జ‌రిపిన మెరుపు దాడుల విష‌య‌మై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా కొత్త చ‌ర్చ‌కు తెర తీయ‌ట‌మే కాదు.. మోడీ ప్ర‌త్య‌ర్థుల‌కు బ‌ల‌మైన అస్త్రాన్ని అందించిన‌ట్లుగా మారాయి.

చివ‌ర‌కు క‌మ‌ల‌నాథులు సైతం య‌డ్డీ మాట‌ల‌కు షాక్ తిన్న ప‌రిస్థితి. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ఫ‌ర్లేదు. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేస్తే పార్టీకి జ‌రిగే న‌ష్టం మామూలుగా ఉండ‌ద‌న్న మాట వినిపిస్తోంది. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ 22 ఎంపీ సీట్ల‌ను గెలిచిన 24 గంట‌ల్లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాన్ని కూల్చేస్తామంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ర‌కంగా చూస్తే.. వార్నింగ్ తో కూడిన ఛాలెంజ్ విసిరిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఓట‌ర్ల మీద ప్ర‌భావాన్ని చూపించ‌టం ఖాయ‌మంటున్నారు. కాంగ్రెస్ తో క‌లిసి జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి కుమార‌స్వామి స‌ర్కారును ఏదో రీతిలో కూల్చేయాల‌న్న ఆలోచ‌న త‌ప్పించి బీజేపీ నేత‌ల‌కు మ‌రింకేమీ లేద‌న్న భావ‌న ఇప్ప‌టికే క‌న్న‌డ ఓట‌ర్ల‌లో ఉంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత‌ల్ని ఏదోలా బీజేపీలోకి లాగాల‌న్న ప్ర‌య‌త్నాలు త‌ర‌చూ జ‌రుగుతూ ఉన్నాయి. ఇలాంటివేళ‌లో.. 22 ఎంపీల‌ను గెలిచిన వెంట‌నే కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లుతాయ‌న్న య‌డ్డీ మాట‌పై సొంత పార్టీలోనే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలాంటి వ్యాఖ్య‌లు పార్టీ మీద ప్ర‌భావాన్ని చూపించ‌ట‌మే కాదు.. ఓట‌ర్ల మ‌న‌సును మార్చేలా చేస్తుంద‌ని.. అధికార పార్టీపై సానుభూతి పెరిగే అవ‌కాశాన్ని ఇస్తుంద‌న్న మాట చెబుతున్నారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఆయ‌న మాట‌ల్లోఆత్మ‌విశ్వాసం కంటే.. అతివిశ్వాసం క‌నిపిస్తోంద‌ని.. రాజ‌కీయాల్లో ఈ తీరు ఏ మాత్రం మంచిది కాద‌న్న అభిప్రాయం ఉంది. తాజాగా ఆయ‌న మాట‌లు చూస్తే.. కర్ణాట‌క‌లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. నేనీ మాట‌లు గ‌ర్వంతోనో.. పార్టీ బ‌లంతోనో చెప్ప‌టం లేదు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 22 సీట్లు గెలిస్తే.. ఫ‌లితాలు వ‌చ్చిన ప‌క్క‌రోజునే కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి ప్ర‌భుత్వాన‌ని దించేస్తాం. ఇప్పుడున్న ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ఇక ఎన్నో రోజులు సీఎంగా కొన‌సాగ‌రంటూ వ్యాఖ్య‌లు చేశారు.

త‌న మాట‌లు గ‌ర్వంతోనో.. పార్టీ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ మాట్లాడ‌టం లేద‌ని య‌డ్డి చెప్పిన‌ప్ప‌టికీ.. ఆయ‌న మాట‌ల్లో మాత్రం అహంకారం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది. ఇలాంటి మాట‌లు పార్టీ విజ‌యాన్ని ప్ర‌భావితం చేస్తాయంటున్నారు. పార్టీని దెబ్బ తీసేలా ఎవ‌రో ప్ర‌య‌త్నాలు చేయ‌క్క‌ర్లేద‌ని.. య‌డ్డి ఆ ప‌నిని అడ‌గ‌కుండానే చేస్తార‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News