'రైతుబంధు'పై చిన్న అధికారి ఒకరి సూచనను కేసీఆర్ వింటారా?

Update: 2023-01-11 09:00 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమల్లోకి తీసుకొచ్చిన పథకాల్లో అందరి నోట నానటమే కాదు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు సైతం ఆ పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచన చేసేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.

రైతుబంధు పథకంలోని మేజిక్ ను గుర్తించిన మోడీ సర్కారు సైతం దానిని అమలు చేసే దిశగా అడుగులు వేయటం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఎకరానికి రూ.5 వేలు చొప్పున ఏడాదికి రెండుసార్లు.. అంటే ఎకరానికి రూ.10 చొప్పున నగదు ఇవ్వటం తెలిసిందే.

తెలంగాణలో సూపర్ హిట్ అయిన ఈ పథకం పుణ్యమా అని.. వ్యవసాయ భూముల ధరలు పెరిగేందుకు కారణమైందని చెప్పక తప్పదు. అప్పటివరకు వ్యవసాయ భూమి ఉంటే.. అయితే పంట కారణంగా వచ్చే ఆదాయం.. లేదంటే కౌలు రూపంలో వచ్చే రాబడి తప్పించి మరింకేమీ ఉండేది కాదు.

ఎప్పుడైతే రైతుబంధు వచ్చిందో.. ఏడాది ఎకరాకు రూ.10 వేల కచ్ఛిత ఆదాయం రావటం మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక చిరుద్యోగి ఒకరు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు.

అందులో రైతుబంధు పథకం కింద ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని ఐదు ఎకరాలకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ఐదు కంటే ఎక్కువ భూమి ఉన్నప్పటికి వాటికి ఎలాంటి ప్రోత్సాహకాన్ని ఇవ్వకుండా ఉండాలన్నది ఆయన సూచన.

అయితే.. తాను చేసిన సూచనతో మేలు జరుగుతుందన్నది ఆయన వాదన. అదెలానంటే.. ఐదు ఎకరాల వరకే రైతుబంధు అమలవుతుందన్న సీలింగ్ పెట్టటం ద్వారా.. భారీ మొత్తంలో ప్రభుత్వానికి నిధులు మిగులుతాయని.. ఆ మొత్తాన్ని రైతులు పొలాలకు వెళ్లే కాలిబాటలు నిర్మించటానికి ఉపయోగించాలన్న సూచనను ఆయన చేస్తున్నారు.

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేస్తున్న పరశురాములు తన సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపారు. ఒకవేళ.. ఆ సూచన కానీ సీఎంను ఆకర్షించి.. ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి మార్పులు చేస్తే మాత్రం ఆ క్రెడిట్ ఈ చిరుద్యోగికి దక్కుతుందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News