నితీష్ అయినా సక్సెస్ అవుతారా?

Update: 2022-08-13 10:30 GMT
నాన్ ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా బలమైన ప్రతిపక్షాన్ని తయారు చేయాలనేది చాలాకాలంగా ప్రతిపక్షాలు కంటున్న కలలు. కలలు కంటున్నారే కానీ ఎవరు అందుకు శ్రీకారం చుట్టలేదు. అయితే ఈ మధ్య బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాధ్యతలు తీసుకున్నారు. కొంతవరకు ప్రయత్నించారు కానీ సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఆమె ఒంటెత్తు పోకడలు, కాంగ్రెస్ అంటే ద్వేషం కారణంగానే ఆమె ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో కాస్త హడావుడిచేసినా ఉపయోగం లేకపోయింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించిన మమత ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో పూర్తిగా యూ టర్న్ తీసుకుని నాన్ ఎన్డీయే పార్టీలకు షాకిచ్చారు. దాంతో ఆమెను చాలా పార్టీలు నమ్మటం లేదు.

తర్వాత కేసీయార్ కూడా నరేంద్రమోడీకి వ్యతిరేకంగా స్వరంపెంచారు. అయితే ఈయన ఏమాలోచిస్తారో ? ఏమి మాట్లాడుతారో ఎవరికీ అర్ధంకాదు. పైగా ఎప్పుడెవరితో దోస్తానా చేస్తారో కూడా తెలీదు. అందుకనే క్రెడిబులిటిలేని కేసీయార్ తో చేతులు కలపటానికి ఎవరు సిద్ధంగాలేరు.

కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకోవాలని అనుకున్నా మమత, కేసీయార్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడుతు మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తానని ప్రకటించారు. ప్రధానమంత్రి కావాలన్న ఆశ లేదని స్పష్టం చేశారు. బీహార్ వదిలి వెళ్ళాలన్న ఆలోచన లేదని చెబుతున్న నితీష్ మిగిలిన ప్రతిపక్షాలతో మాట్లాడితే చాలా పార్టీలు ఆయన మాట వినే అవకాశముంది.

ముఖ్యమంత్రిగా అవినీతి మరకలేని వ్యక్తిగా నితీష్ కు మంచి క్రెడిబులిటి ఉంది. పైగా ఇప్పటికి ఎనిమిదిసార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ నిర్వహణతో పాటు పరిపాలనలో కూడా మంచి అనుభవం ఉంది. కాబట్టి మమత, కేసీయార్ కన్నా నితీష్ ప్రతిపక్షాలకు మంచి ఛాయిస్ అవుతారనటంలో సందేహం లేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఉన్నప్పటికీ ఆయన వయసు 80. కాబట్టి నితీష్ మంచి ఛాయిస్ అన్నట్లే అనిపిస్తోంది. మరి ప్రతిపక్షాలను కూడదీయటంలో సక్సెస్ అవుతారా ?
Tags:    

Similar News