పవన్ రాజకీయాల కాడి వదిలేయడమేనా?

Update: 2019-11-02 07:03 GMT
సినిమాల్లో గొప్ప స్టార్ లు.. కోట్ల మంది హృదయాల్లో గుడికట్టుకున్నారు. కానీ రాజకీయ తెరపై మాత్రం వీరి ఆట సాగడం లేదు. తమిళనాట కమల్ తేలిపోయాడు. గతంలో తెలుగునాట చిరంజీవి చాపచుట్టేశారు. ఇక వర్ధమాన హీరోల్లో బాగా ప్రజాదరణ కలిగిన పవన్ సైతం రాజకీయాల్లో ఘోర ఓటమిని చవిచూశారు. రాజకీయాల్లో తారలు రాణించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలపై బోలెడు ఆశలు పెంచుకున్నారు. కనీసం 50 సీట్లలోపు సాధించి హంగ్ వస్తే కింగ్ మేకర్ అవుదామని.. మరో కర్ణాటక కుమారస్వామి అయిపోదామని ఎన్నో కలలుగన్నాడు. కానీ పవన్ ను జనాలు చీత్కరించారు.. చిత్తుగా ఓడించారు. రెండు చోట్ల పోటీచేస్తే ఒక్క చోట కూడా జనసేనానిని గెలిపించలేకపోయారు. మరి ఈ దారుణ ఓటములతో పవన్ నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఆయన అన్నయ్య చిరంజీవి సైతం కనీసం 18 సీట్లు సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. కానీ పవన్ మాత్రం అన్నయ్యకు దగ్గరకు కూడా రాలేకపోయాడు.

తాజాగా జనసేనానికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నేతలంతా జనసేనను వీడుతున్నారు. ఇప్పటికే పార్టీలో కీలకంగా ఉన్న వారంతా వైసీపీ, బీజేపీ బాటపట్టారు. ఇప్పుడు మరో కీలక నాయకుడు కూడా పవన్ కు షాకిచ్చారు. జనసేనకు ఆ పార్టీ సీనియర్ నేత పసుపులేటి బాలరాజు గుడ్ బై చెప్పారు. ఈయన విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. బాలరాజు వైఎస్,కిరణ్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల తర్వాత జనసేన ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే కీలక నేతలు వలసపోయిన వేళ..  బాలరాజు వైదొలగడం జనసేనలో మరింత కలకలం రేపింది.

ఈ పరిణామాలతో జనసేనను... పవన్ ను నమ్మే పరిస్థితి నేతల్లో లేదని  అర్థమవుతోంది. పవన్ ను నమ్మి వచ్చే 2024 వరకు   ఆ పార్టీ నేతలు కొనసాగడం కల్ల అంటున్నారు.  2024 వరకు పవన్ పార్టీలో నాయకులు లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు.

జనసేన పార్టీ నుంచి కీలక నేతలు అంతా వీడుతుండడం.. ఇతర పార్టీలో చేరుతుండడం.. కొత్తరక్తం కూడా రాకపోవడంతో ఇక పవన్ రాజకీయాల కాడి వదిలి మళ్లీ సినిమాల్లోకి వస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇటీవలే రాంచరణ్ కూడా బాబాయ్ పవన్ కొన్ని కథలు వింటున్నారని చెప్పిన దృష్ట్యా ఇక తనకు అచ్చిరాని ఫెయిల్ అయిన రాజకీయాలను పవన్ వదిలిపెడుతున్నారా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. అదే జరిగితే అటు అన్న చిరంజీవికి, ఇటు తమ్ముడు పవన్ కు రాజకీయాలు పీడకలను మిగిల్చినట్టే.. 
Tags:    

Similar News