పాద‌యాత్ర రాహుల్‌కు ప్రధాని పీఠం అందించేనా?

Update: 2022-09-07 09:39 GMT
2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌డుతున్న భార‌త్ జోడో యాత్ర సెప్టెంబ‌ర్ 7న ప్రారంభం కానుంది. త‌మిళ‌నాడులోని మూడు సముద్రాలు (బంగాళాఖాతం, హిందూమ‌హాస‌ముద్రం, అరేబియా స‌ముద్రం) క‌లిసే సంగ‌మ స్థ‌లం క‌న్యాకుమారి నుంచి రాహుల్ త‌న యాత్రను ప్రారంభించ‌నున్నారు. త‌మిళ‌నాడులోని కన్యాకుమారి నుంచి జ‌మ్ముక‌శ్మీర్ వ‌ర‌కు మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా రాహుల్ గాంధీ పాద‌యాత్ర జ‌రుగుతుంది. మొత్తం 150 రోజుల‌పాటు 3,500 కిలోమీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర ఉంటుంద‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత సంధికాలంలో ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో వ‌రుస పెట్టి పార్టీ నేత‌లు రాజీనామాలు చేశారు. జ్యోతిరాధిత్య సింధియా, క‌పిల్ సిబ‌ల్, జితేంద్ర ప్ర‌సాద‌, హార్దిక్ ప‌టేల్, తాజాగా కొద్దిరోజుల క్రితం గులాంన‌బీ ఆజాద్ ఇలా వ‌రుస పెట్టి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అదేవిధంగా ప‌లు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఇత‌ర ముఖ్య నేత‌లు సైతం కాంగ్రెస్ను విడిచిపెట్టేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఏకంగా ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో రాహుల్ గాంధీ చేప‌ట్టున్న యాత్ర కాంగ్రెస్ పార్టీకి జ‌వ‌సత్వాలు చేకూర్చుతుందా అని విశ్లేష‌కులు చ‌ర్చ‌ల్లో ప‌డ్డారు. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అయితే ఈ ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి రాహుల్ గాంధీ సిద్ధంగా లేరు. రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ వంటివారు కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తార‌ని అంటున్నారు.

మ‌రోవైపు దేశ ఐక్య‌త కోస‌మే తాను ఈ యాత్ర చేప‌డుతున్నాన‌ని రాహుల్ గాంధీ చెబుతున్నారు. అయితే దేశ ఐక్య‌త కంటే ముఖ్యంగా రాహుల్ చేప‌ట్టే పాద‌యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంద‌ని భావిస్తున్నారు. అలాగే పార్టీ నుంచి జంపింగులు ఆగిపోతాయ‌ని ఆశిస్తున్నారు. ముఖ్యంగా సీనియ‌ర్లు, జూనియ‌ర్లుగా విడిపోయిన కాంగ్రెస్ ను ఐక్యం చేసేందుకు రాహుల్ భార‌త్ జోడో యాత్ర ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

అదేవిధంగా బీజేపీ అన్నా, న‌రేంద్ర మోడీ అన్నా గిట్ట‌ని వ‌ర్గాలు, సంఘాలు, ప్రాంతీయ పార్టీలు రాహుల్ గాంధీపైనే ఆశ‌లు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ బ‌ల‌బ‌డితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోతుంద‌ని విశ్వ‌సిస్తున్నాయి. త‌ద్వారా ప్రాంతీయ పార్టీలతో క‌లిసి కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చ‌ని భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ దేశ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే వీలు ఉంద‌ని అంటున్నాయి.

మ‌రోవైపు ఒక‌ప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం రాజ‌స్థాన్, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ల్లో మాత్ర‌మే అధికారంలో ఉంది. ఇటీవ‌ల బిహార్ లోని నితీష్ కుమార్ ప్ర‌భుత్వంలోనూ చేరింది. 2004, 2009 ఎన్నిక‌ల్లో స‌త్తా చాటి వ‌రుస‌గా ప‌దేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2014లో న‌రేంద్ర మోడీ ప్ర‌ధానిగా ఎన్నికైన నాటి నుంచి ప‌త‌నంగా దిశ‌గా సాగుతూ వ‌చ్చింది. 2014 నుంచి రోజురోజుకి తీసిక‌ట్టులా త‌యారైంది. 2019 ఎన్నిక‌ల్లో స్వ‌యంగా రాహుల్ త‌న కుటుంబానికి కంచుకోట అయిన అమేథిలో ప‌రాజ‌యం పాల‌వ్వాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో పోయిన ప్రాభ‌వాన్ని తెచ్చుకోవ‌డానికి భార‌త్ జోడో యాత్ర రాహుల్ గాంధీకి ఒక సువ‌ర్ణావ‌కాశం అని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదగడానికి, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నింటిని ఏకం చేయ‌డానికి రాహుల్‌కు 'భారత్‌ జోడో' యాత్ర కలిసొస్తుందని విశ్లేష‌కులు చెబుతున్నారు. అదే సమయంలో... 2024లో మూడోసారి అధికారంలోకి రాకుండా మోదీ సర్కారును రాహుల్ ఏ మేరకు నిలువరించగలరనేది కూడా ఈ యాత్ర తేల్చనుంద‌ని అంటున్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, అలాగే మోదీకి తానే ప్రత్యామ్నాయ నేత‌న‌ని చాటేందుకు భారత్‌ జోడో యాత్ర రాహుల్ కు అవకాశం కల్పించనుంద‌ని పేర్కొంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News