క్షమాపణలు చెప్పిన వివాదాస్పద 'బాబా'..!

Update: 2022-11-28 09:30 GMT
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటారు. పతంజలి వస్తువుల తయారీలో.. ఆ మధ్య కరోనాకు మందును కనిపెట్టామని ప్రకటించడం వంటి వాటితో పలుసార్లు విమర్శలకు గురయ్యారు. ఇక తాజాగా మహిళ వస్త్రధారణ విషయంలో నోటిదూలను ప్రదర్శించి మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారడంతో చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఇటీవల ముంబై మహిళా పతంజలి యోగా సమితి థానేలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృతా ఫడ్నవిస్‌.. రామ్‌దేవ్‌ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాందేవ్ బాబు మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

"మహిళలు తనలాగా దుస్తులు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు.." అంటూ రామ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజాసంఘాలు.. మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. మహిళలకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

రాందేవ్ బాబా వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి మలివాల్‌ స్పందించారు. దేశ మహిళలకు రాందేవ్ బాబా వెంటనే క్షమాపణలు చెప్పాలని ట్విట్టర్‌ మాధ్యమంగా ఆమె అడిగారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృతా ఫడ్నవిస్‌ ఎదుట రామ్‌దేవ్‌ మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఖండించదగినవ్నారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా క్షమాపణ లేఖను మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ రూపాలీ చకాంకర్‌ ట్విట్టర్లో పోస్టు చేశారు. "మహిళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "బేటీ బచావో - బేటీ పడావో" వంటి కార్యక్రమాలు నేను ప్రోత్సహిస్తాను.. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం లేదని" లేఖలో పేర్కొన్నారు.

ఇక సోషల్‌మీడియాలో వైరలవుతున్న వీడియో క్లిప్‌ పూర్తిగా వాస్తవం కాదన్నారు. అయినప్పటికీ తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే.. వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నానని రాందేవ్‌ బాబా పేర్కొన్నారు. కాగా తెలంగాణలోనూ రాందేవ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయి.

యోగా పేరుతో రాందేవ్ బాబా కార్పొరేట్ వ్యవస్థను నడిపిస్తున్నాయంటూ కాంగ్రెస్.. సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాందేవ్ క్షమాపణతోనైనా ఈ వివాదం సర్దుమణుగుతుందో లేదో వేచి చూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News