ఈసారైనా ఈయన కోరిక తీరుతుందా ?

Update: 2021-08-30 08:30 GMT
పాపం చాలా కాలంగా ఈ సీనియర్ నేత ఆశలు ఎండమావుల్లా ఊరిస్తున్నాయి. ఈయనకేమో మంత్రివర్గంలో చోటుకావాలి. కానీ జగన్మోహన్ రెడ్డేమో తీసుకెళ్ళి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. దాంతో ఆయనకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. ఇప్పటికే విషయం అర్ధమైపోయుంటుంది. అవునే ఇదంతా తమ్మినేని సీతారమ్ గురించే. తొందరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో తనకు మంత్రిపదవి ఖాయమని తమ్మినేని బాగా ఆశలే పెట్టుకున్నారు.

నిజానికి తమ్మినేని అంటేనే బాగా దూకుడుమీదుంటారని అందరికీ తెలిసిందే. ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్ధులపై నోరుపారేసుకోవటంలో ఈయన భలే స్పీడుగా ఉంటారు. స్పీకర్ గా ఉండి పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన వ్యక్తి వాటిని పట్టించుకోవటంలేదు. ఈ విషయంలో తనకన్నా ముందు పనిచేసిన స్పీకర్ కోడెలశివప్రసాదరావే ఆదర్శం అన్నట్లుగా మాట్లాడుతుంటారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గంనుండి ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. జిల్లాలోని సీనియర్ నేతల్లో తమ్మినేని కూడా ఒకరు. కాబట్టి తనకు కచ్చితంగా మంత్రిపదవి గ్యారెంటీ అని అనుకున్నారు. అయితే జగన్ మాత్రం ధర్మాన కృష్ణదాస్ కు మంత్రిపదవి ఇచ్చి తమ్మినేనికి స్పీకర్ పదవిని అప్పగించారు. ఇష్టంలేకపోయినా వేరేదారి లేక తమ్మినేని స్పీకర్ గా బాధ్యతలు తీసుకోకతప్పలేదు. అయితే ఎప్పుడెప్పుడు మంత్రివర్గంలో చేరిపోదామా ? అని ఎదురు చూస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే గతంలో జగన్ చెప్పిన రెండున్నరేళ్ళ గడవు డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. కాబట్టి తనకు కచ్చితంగా మంత్రిపదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే జగన్ను కలిసి తన మనసులోని మాటను చెప్పుకున్నారట. పనిలోపనిగా విజయసాయిరెడ్డికి కూడా తన కోరికను కూడా చెప్పుకున్నట్లు సమాచారం. అయితే జగన్ దగ్గర రికమెండేషన్లు కుదరదన్న విషయం స్పీకర్ కు బాగా తెలుసు.

ఎవరి విషయంలో అయినా తనంతట తానుగా కన్వీన్స్ అయితనే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారు జగన్. అప్పటివరకు సదరు నేతకు పదవీయోగం దక్కటం కష్టమనే అనుకోవాలి. నిజానికి పదవుల విషయంలో ఒకరిని రికమెండ్ చేసేంత సీన్ కూడా పార్టీలో ఎవరికీ లేదనే చెప్పాలి. ఎందుకంటే నిర్ణయం బయటపడేంతవరకు జగన్ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. అందుకనే తన విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్ధంకాక తమ్మినేనిలో టెన్షన్ పెరిగిపోతోందట. చూద్దాం ఈసారైనా తమ్మినేని ఆశలు తీరుతుందేమో.
Tags:    

Similar News