ఈ ఫొటో చూశాకైనా ఏపీ మంత్రికి జ్ఞానోదయం అవుతుందా?

Update: 2023-01-21 08:14 GMT
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ లో ప్రపంచ ఎకనమిక్‌ ఫోరం సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏపీ ప్రభుత్వానికి అసలు ఆహ్వానమే అందలేదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాథ్‌ తమకు నవంబర్‌ లోనే ఆహ్వానం అందిందని మీడియాకు తెలిపారు. విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ జరగనుందని.. ఆ ఏర్పాట్లు పరిశీలించాల్సి ఉందని.. అందుకే తాము దావోస్‌ కు వెళ్లలేదని వివరించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం దావోస్‌ సదస్సుకు అసలు ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానమే అందలేదని చెబుతున్నాయి.

ఇంకో రెండు నెలల్లో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీటింగ్‌ ఉందని మంత్రి అమరనాథ్‌ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దావోస్‌ సదస్సుకు వెళ్లి విశాఖ సదస్సుకు రావాలని ప్రపంచవ్యాప్తంగా ఆ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే అవకాశం ఉన్నా మంత్రి అమరనాథ్‌ ఆ చాన్సును పోగొట్టుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరైనా ఎక్కడైనా ఇన్వెస్టర్ల సదస్సు లేదా పారిశ్రామికవేత్తల సమావేశాలు జరుగుతుంటే వాటికి హాజరై తాము సైతం ఇలాంటిదే తమ రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని.. మీరంతా తప్పకుండా రావాలని ఆహ్వానించాల్సిన బాధ్యత పరిశ్రమల శాఖ మంత్రిగా అమరనాథ్‌ పై ఉంది. అయితే ఆయన తన బాధ్యతలను విస్మరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పరిశ్రమలు, ఐటీ శాఖల గురించి అమరనాథ్‌ కు అసలు అవగాహనే లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ను విమర్శించడం ద్వారానే ఆయన మంత్రి పదవి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే మంత్రి పదవి పొందిన నాటి నుంచి తన శాఖ వ్యవహారాల కంటే పవన్‌ కల్యాణ్‌ పైన విమర్శలకే గుడివాడ అమరనాథ్‌ ప్రాధాన్యత ఇచ్చారు.

అలాగే పవన్‌ కల్యాణ్‌ తో తాను ఫొటో దిగలేదని.. ఆయనే తనతో ఫొటో దిగాడని వితండవాదం చేసి కూడా అమరనాథ్‌ ఇప్పటికే నవ్వులపాలయ్యారని అంటున్నారు. అదేవిధంగా వైసీపీ మేనిఫెస్టోలో మద్యనిషేధం ఎక్కడ ఉందో చూపాలంటూ అడ్డదిడ్డంగా వాదించి బుక్కయ్యారని గుర్తు చేస్తున్నారు.

ఓవైపు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను తెలంగాణకు ఆహ్వానిస్తూ హైదరాబాద్‌ తోపాటు ఇతర నగరాలకు సైతం భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో గుడివాడ అమరనాథ్‌ మాత్రం ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమవుతున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో వ్యవహరిస్తున్న శైలి చూసి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తన అమరరాజా బ్యాటరీల ఫ్యాక్టరీని తెలంగాణకు తరలించేశారు. రూ.9500 కోట్ల పెట్టుబడిని గల్లా జయదేవ్‌ తెలంగాణలో పెడుతున్నారు. మరోవైపు జాకీ పరిశ్రమ సైతం అనంతపురం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు తట్టుకోలేక రాష్ట్రం నుంచి బిచాణా ఎత్తేసిందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా దావోస్‌ సదస్సుకు హాజరైన కేటీఆర్, గల్లా జయదేవ్‌ ఫొటోలు దిగారు. ఈ ఫొటో చూసైనా తాను చేయాల్సిన పనేంటో గుడివాడ అమరనాథ్‌ కు గుర్తొస్తే చాలని ప్రజలు భావిస్తున్నారు.

వాస్తవానికి గల్లా జయదేవ్‌ టీడీపీ ఎంపీ. అయినా రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూసే అలవాటున్న కేటీఆర్‌ ఆ అంశాన్ని పట్టించుకోకుండా తమ రాష్టంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ఒక పారిశ్రామికవేత్తను స్వాగతించినట్టే జయదేవ్‌ ను స్వాగతించారు. ఈ తెలివిడి లేని గుడివాడ అమరనాథ్‌ మాత్రం ఇంకా చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News