అసెంబ్లీలో జనసేన జెండా ఎగురుతుందా ?

Update: 2022-09-20 02:30 GMT
జనసేన పార్టీలోని లీగల్ సెల్ ఏర్పాటు సందర్భంగా అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ జనసేన జెండా ఎగురుతుందన్నారు. అసెంబ్లీలో ఒక పార్టీ జెండా ఎగురుతుంది అంటే అర్ధమేంటి ? సదరు పార్టీ అధికారంలోకి వస్తుందనే అర్ధం. పార్టీ అధికారంలోకి రాకపోతే అసెంబ్లీలో జెండా ఎగురుతుందనరు. ఇపుడు కూడా జనసేనకు అసెంబ్లీలో ఒక సభ్యుడున్నారు. దీన్ని జెండా ఎగరేయటం అనరు.

సరే ఎవరైనా తమ పార్టీ గెలవాలి, అధికారంలోకి రావాలనే కోరుకుంటారు. కాబట్టి ఇపుడు పవన్ ఆశించటాన్ని కూడా తప్పుపట్టాల్సిన అవసరంలేదు. కానీ అసెంబ్లీలో జెండా ఎగరేసేంత సీన్ జనసేనకు ఉందా ? అన్నదే కీలకమైన పాయింట్.

పైగా గెలిచేవాళ్ళకే ఎన్నికల్లో టికెట్లిస్తామని పవన్ ప్రకటించటం కూడా విడ్డూరమనే చెప్పాలి. పోయిన ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేసిన తాను ఓడిపోతానని పవన్ అనుకున్నారా ?  మరపుడు తాను గెలిచే క్యాండిడేట్ కాదనే కదా అర్ధం.

ఏదేమైనా జెండా ఎగరేయాలని అనుకుంటున్న పవన్ దానికి రెడీ అయ్యారా ? క్షేత్రస్ధాయిలోని సమాచారం ప్రకారం పార్టీ ఇప్పటికి కూడా సన్నద్దంకాలేదు. తక్కువలో తక్కువ 150 నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులే లేరు. పోయిన ఎన్నికల్లో మూడోస్ధానంలో నిలిచిన అభ్యర్ధుల్లో  ఇపుడు ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారో తెలీదు. అలాంటి వాళ్ళని లెక్కలోకి తీసుకుంటే ఓ 25 మందిని గట్టి నేతలని అనుకోవచ్చంతే.

మరి మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి ఏమిటి ? బహుశా తెనాలిలో నాదెండ్ల మనోహర్, రాజోలులో బొంత రాజేశ్వరరావు పోటీచేసే అవకాశముంది. మరి మిగిలిన నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారెందరు ? అసలు పవన్ కల్యాణ్ ఎక్కడినుండి పోటీచేస్తారో కూడా తెలీదు.

ఒకవైపు ఒంటరిగానే పోటీచేస్తామనే అర్ధమొచ్చేట్లు మాట్లాడుతారు. మరో సందర్భంలో తమతో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామంటారు. ఇన్ని అయోమయాల మధ్య అసెంబ్లీలో జెండా ఎగురుతుందంటే నమ్ముతారా ?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News