కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పొలిటిక‌ల్ కెరీర్‌కు ముగింపేనా?

Update: 2021-10-08 09:30 GMT
ఆ సోద‌రులు కాంగ్రెస్ పార్టీతో రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించారు.. యూత్ విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.. గ‌తంలో ముఖ్యంగా వైఎస్సార్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు కొన్ని త‌ప్ప‌ట‌డుగులు వ‌ల్ల అధిష్ఠానం ఆగ్ర‌హానికి గురైన వాళ్ల రాజ‌కీయ కెరీర్ ముగింపు దిశ‌గా సాగుతుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇంత‌కీ ఆ సోద‌రులు ఎవ‌రంటే.. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌. పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులుగా మంచి భ‌విష్య‌త్ ఉన్న నాయ‌కులైన ఈ సోద‌రులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిటా? అని రాజ‌కీయ విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో ప్ర‌తి గ్రామంలోనూ కార్య‌క‌ర్త‌ల బలం ఉన్న కోమటిరెడ్డి సోద‌రుల‌కు నిల‌క‌డ ఉండ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పార్టీకి విధేయులుగా ఉన్న వీళ్లు త‌మ‌కు పార్టీలో అన్యాయం జ‌రిగింద‌ని భావించి నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు త‌మ ఆగ్ర‌హాన్ని వెళ్ల‌గ‌క్కి అధిష్ఠానం దృష్టిలో ఉన్న మంచి పేరు పోగొట్టుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజ‌గోపాల్ రెడ్డి గ‌తంలో బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేసి కాంగ్రెస్ అధిష్టానం ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. ఇక అన్న భువ‌న‌గిరి ఎంపీ వెంక‌ట‌రెడ్డి త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ఆశించిన ఆయ‌న‌.. అధిష్ఠానం రేవంత్ రెడ్డికి దాన్ని క‌ట్ట‌బెట్ట‌డంతో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రేవంత్‌పై కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

ఇలాంటి వ్య‌వహార శైలితో ఈ బ్ర‌ద‌ర్స్‌కే ఎక్కువ న‌ష్టం క‌లిగే ప్ర‌మాదం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అధిష్ఠానం త‌మ‌పై ధిక్కార స్వ‌రాన్ని అస్స‌లు స‌హించ‌ద‌నే విష‌యాన్ని పార్టీలో ఇన్నేళ్లుగా ఉంటున్న వీళ్లు అర్థం చేసుకోక‌పోవ‌డం ఏమిట‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక పార్టీలో ప‌రిస్థితులు కూడా వేగంగా మారుతున్నాయి. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌కు పెట్టి మ‌రీ ఎవ‌రి వ‌ల్ల పార్టీకి మేలు జ‌రుగుతుందో వాళ్లకే రాహులు, ప్రియాంక గాంధీ ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. మ‌రోవైపు పార్టీ అధినేత్రి సోనియా కూడా రాహుల్ భ‌విష్య‌త్ కోసం సీనియ‌ర్ల‌ను దూరం పెడుతూ యువ నాయ‌కుల‌ను అంద‌లం ఎక్కిస్తున్నారు. త్వ‌రలో పార్టీలో ఓ గ్రూపుగా ఏర్ప‌డిన 23 మంది సీనియ‌ర్ నేత‌ల‌ను ఇంటికి పంపించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కాస్త త‌గ్గి ఉండి అధిష్ఠానికి విధేయులుగా మ‌ర్య‌దాగా ప్ర‌వ‌ర్తిస్తే భ‌విష్య‌త్ ఉంటుంద‌ని వాళ్ల అభిమానులే స‌ల‌హాలిస్తున్నారు. అలా కాకుండా వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించి అలిగి ఇంట్లో కూర్చుంటే మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కాంగ్రెస్ హైక‌మాండ్ ఎవ‌రికి సీటు ఇస్తే వాళ్ల కోస‌మే క్యాడ‌ర్ ప‌ని చేస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కొత్త పీసీసీ అధ్య‌క్షుడి రేవంత్ దూకుడుతో తెలంగాణ‌లో పుంజుకుంటున్న పార్టీ రాబోయే ఎన్నిక‌ల్లో అధికారం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ సైలెంట్గా ఉన్న పెద్ద న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకే ఈ ధిక్కార స్వ‌రాన్ని త‌గ్గించుకుని పార్టీ కోసం ప‌ని చేస్తే మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ఈ బ్ర‌ద‌ర్స్ త‌మ ప‌ద్ధ‌తిని మార్చుకుంటారేమో చూడాలి.




Tags:    

Similar News