తుమ్మ‌ల కారు దిగుతారా?

Update: 2021-07-10 00:30 GMT
ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ముద్ర ఏంట‌నేది రాష్ట్ర‌వ్యాప్తంగా సుప‌రిచిత‌మే. నాలుగు ద‌శాబ్దాలకు చేరువ కాబోతున్న ఆయ‌న రాజ‌కీయ జీవితంలో.. మెజారిటీ కాలం జిల్లా రాజ‌కీయాల‌ను శాసించారు. టీడీపీలో ఉన్నంత కాలం తిరుగులేని నాయ‌కుడిగా ఉన్నారు. టీఆర్ఎస్ లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా మంత్రిగా హ‌వా కొన‌సాగించారు. అయితే.. 2018 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత మొత్తం త‌ల‌కిందులైంది. ఇప్పుడు ఆయ‌న టీఆర్ఎస్ లో ఉన్న సీనియ‌ర్‌ నేత‌. అంత‌కు మించి.. మ‌రే ప్రాధాన్య‌మూ లేకుండా పోయింది.

నిజానికి తుమ్మ‌ల‌కు టీఆర్ఎస్ చేయాల్సినంత చేసింది. ఆయ‌న పార్టీలోకి రావ‌డ‌మే మంత్రి ప‌ద‌వి హామీతో వ‌చ్చారు. చెప్పిన‌ట్టుగానే.. రోడ్లు భ‌వ‌నాల శాఖను క‌ట్ట‌బెట్టారు కేసీఆర్‌. ఆ త‌ర్వాత పాలేరు ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపుకోసం టీఆర్ఎస్‌ స్పెష‌ల్ ఇంట్రెస్ట్ చూపించింది. ఆ త‌ర్వాత తుమ్మ‌ల హ‌వా కొన‌సాగింది. 2018 ఎన్నిక‌ల వ‌ర‌కు దూకుడు కొన‌సాగించారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్రం మొత్తం కారు జోరు కొన‌సాగినా.. ఖ‌మ్మంలో మాత్రం పంక్ఛ‌రైపోయింది. ప‌ది ఎమ్మెల్యే స్థానాల‌కు ఒకే ఒక్క సీటు గెలిచింది టీఆర్ఎస్‌. మంత్రిగా ఉన్న తుమ్మ‌ల ఓట‌మి పాల‌య్యారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే అజ‌య్ కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. దీంతో.. ప‌రిస్థితులు మొత్తం వేగంగా మారిపోయాయి.

దీంతో.. తుమ్మ‌ల ప్రాభ‌వం వేగంగా ప‌డిపోతూ వ‌చ్చింది. మంత్రిగా అజ‌య్‌.. చ‌క్రం తిప్పుతూ.. ఇత‌ర గ్రూపుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతూ వ‌చ్చింది. జిల్లాలో.. అజ‌య్‌, తుమ్మ‌ల‌, నామ నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వ‌ర్గాలు బ‌లంగా ఉన్నాయి. వీరిలో.. మంత్రిగా అజ‌య్‌, ఎంపీగా నామా హ‌వా కొన‌సాగుతుండ‌గా.. తుమ్మ‌ల‌, పొంగులేటి వ‌ర్గాలు డీలా ప‌డిపోయాయి.

జిల్లాలో క్షేత్ర‌స్థాయిలో తుమ్మ‌ల‌కు మంచి ప‌ట్టు ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. కానీ.. ఎంత ప‌ట్టున్నా.. అధికారం చేతిలో ఉండాల్సిందే. అప్పుడే.. నాయ‌కులు, జ‌నం వెంట ఉంటారు. అవేవీ లేక‌పోతే.. ఒంట‌రిగా మిగిలిపోవాల్సిందే. గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ అన్నీతానై వ్య‌వ‌హ‌రించి, త‌న‌వారికి టిక్కెట్లు ఇప్పించుకున్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. ఇప్పుడు అజ‌య్ కారు న‌డిపిస్తుంటే.. మౌనంగా చూస్తూ ఉండాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఈ ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేసింది. తుమ్మ‌ల‌కు క‌మ‌లం కండువా క‌ప్పాల‌ని నేత‌లు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. కానీ.. తాను బీజేపీలోకి వెళ్లేది లేద‌ని తుమ్మ‌ల చెప్పారు. కానీ.. అటు నుంచి మాత్రం ప్ర‌య‌త్నాలు ఆగ‌డం లేదు. తాజాగా.. మ‌ళ్లీ కాషాయ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇటు ష‌ర్మిల పార్టీ నుంచి కూడా తుమ్మ‌ల‌కు ఆహ్వానం అందిన‌ట్టుగా చెబుతున్నారు. నిజానికి తుమ్మ‌ల వంటి నేతను ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. దానికి ఆయ‌నకున్న‌ ప‌ట్టు నిద‌ర్శ‌నం. తుమ్మ‌ల చేరిక వ‌ర‌కు ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ నామ‌మాత్రంగానే ఉండేది. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. టీడీపీ కేడ‌ర్ దాదాపుగా ఆయ‌న వెంట న‌డిచింది. దీంతో.. గులాబీ పార్టీ తిరుగులేనిదిగా త‌యారైంది. అయితే.. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి, మ‌ళ్లీ మంత్రిని చేస్తార‌నే ప్ర‌చారం కూడా సాగింది. కానీ.. కేసీఆర్ అలాంటిది ఏమీ చేయ‌లేదు. దీంతో.. తుమ్మ‌ల‌ మౌనంగా ఉండిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

దీన్ని ఆయ‌న అనుచ‌రులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు బీజేపీ, ష‌ర్మిల పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే.. తుమ్మ‌ల ఏమీ సాధార‌ణ నాయ‌కుడు కాదు ఈ పార్టీల బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేయ‌డం పెద్ద విష‌యం కాదు. అందుకే.. ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే.. గులాబీ ద‌ళంలో అజ‌య్ హ‌వా కొన‌సాగుతుండ‌డం.. కేటీఆర్ తో స‌న్నిహితుడి కోటాలో పార్టీలో ప్రాధాన్యం కూడా ఆయ‌న‌కే ఇస్తుండ‌డంతో.. భ‌విష్య‌త్ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని తుమ్మ‌ల కారు దిగే ఆలోచ‌న ఏమైనా చేస్తారా? అనే చ‌ర్చ కూడా ఉంది. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది తెలియాలంటే.. మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News