మ‌హారాష్ట్రంలో ఉద్ద‌వ్ స‌ర్కారు కూలుతుందా?

Update: 2021-02-11 08:37 GMT
మ‌హారాష్ట్రలో 2019, న‌వంబ‌రు 28న కొలువుదీరిన శివ‌సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీల కూట‌మి స‌ర్కారుకు బీట‌లు ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోందా? ఎట్టిప‌రిస్థితిలోనూ మ‌హారాష్ట్రంలో పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్న బీజేపీ ఆదిశ‌గా అడుగులు వేస్తోందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. 2019లో జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో బీజేపీ అధికార పీఠానికి దూర‌మైంది. ముఖ్యంగా శివ‌సేన క‌లిసి వ‌స్తుంద‌ని అనుకున్నా.. సీఎం పీఠంపై ఏర్ప‌డిన ముడి కార‌ణంగా.. చివ‌ర‌కు శివ‌సేన, మాజీ సీఎం శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్నారు.

శివ‌సేన వ‌ర్సెస్ బీజేపీ

అయితే.. త‌మ‌తో జ‌ట్టుక‌ట్ట‌కుండా.. త‌మ‌కు బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంపై శివ‌సేన విష‌యంలో బీజేపీ ఆగ్ర‌హంతో ఉంది. అప్ప‌టి నుంచి ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో వివాదాల‌కు రెడీ అవుతోంది. ఇటు నుంచి ఉద్ద‌వ్ కూడా బీజేపీ విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. బీజేపీ నేత‌ల‌పైనా..కేంద్ర ప్ర‌భుత్వంపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి.. అంటే.. దాదాపు మ‌హా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఏడాది త‌ర్వాత కూడా బీజేపీ ఇక్క‌డ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఉన్న మార్గాల‌పై దృష్టి పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి రావ‌డం క‌న్నా.. అధికార పీఠంలో ఉన్న ఉద్ద‌వ్‌ను దింపేయ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ నేత‌లు పావులు క‌దుపుతున్నారు.

అదే ప్ర‌తీకారం!

మ‌హా రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత శివ‌సేన చీఫ్‌ ఉద్ధవ్‌ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని బీజేపీ అగ్ర‌నాయ‌కులు మరిచిపోవట్లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను సీఎం పీఠం నుంచి దింపి.. గ‌తంలో బిహార్‌లో చేసిన‌ట్టుగా.. ఇక్క‌డ కూడా పొత్తులు మార్చి.. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 7న బీజేపీ ఎంపీ.. నారాయ‌ణ రాణేకు చెందిన ఓ ఆసుప‌త్రిని ప్రారంభించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మ‌హారాష్ట్ర‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో షా చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేశాయి.

ఎన్సీపీతో పొత్తుకు సిద్ధం!

ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ ఉన్న‌ట్టుగా షా ప్ర‌సంగంలో స్ప‌ష్ట‌మైంది. అంతేకాదు.. ఇప్ప‌టికే ఈ విషయంపై ఎన్సీపీ అధినేత పవార్‌తో కూడా చర్చించినట్లు తెలిసింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. సీఎం పీఠాన్ని ఫ‌డ‌ణ‌వీస్‌కు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టిన బీజేపీ.. ఇప్పుడు ఉద్ద‌వ్‌ను దింపేస్తే..చాలు అన్న‌ట్టుగా.. పవార్ ఎవరి పేరును సీఎం పదవికి ప్రతిపాదిస్తే వారినే సీఎం చేయడానికి కూడా సిద్ధమైపోయింది.

మాట త‌ప్ప‌మ‌న‌డానికి మ‌ళ్లీ బీహార్ మంత్రం!

ఇక‌, సీఎం విష‌యంలో తాము మాట త‌ప్పేది లేద‌ని చెప్ప‌డానికి అమిత్ షా మ‌రోసారి.. ఇటీవ‌ల బిహార్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. తమకంటే బిహార్‌లో నితీష్ కుమార్‌(ప్ర‌స్తుత సీఎం) పార్టీ జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా, ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన మాట ప్రకారం తాము నితీశ్ కుమార్‌నే సీఎం పదవిలో కూర్చోబెట్టామని షా వివరించారు. సో.. ఇప్పుడు ఎన్సీపీ ఎవ‌రికి ఇవ్వ‌మంటే వారికే సీఎం పీఠాన్ని ఇచ్చేందుకు బీజేపీ రెడీగా ఉంద‌ని పేర్కొన్నారు. ఇలా.. ఉద్ద‌వ్‌కు ఎస‌రు పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా.. ఎన్సీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ రెడీ అవుతోంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

కొస‌మెరుపు!
గ‌తంలో బిహార్ విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. అప్ప‌ట్లో నితీష్ కుమార్ త‌న జేడీయూను లాలూ ప్ర‌సాద్ నేతృత్వంలోని ఆర్జేడీతో క‌లుపుకొని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదిన్న‌ర తిరిగే స‌రికి.. లాలూకు బై చెప్పి.. బీజేపీతో పొత్తు పెట్టుకుని మ‌ళ్లీ తానే సీఎం అయ్యారు. ఇప్పుడు మ‌హాలోనూ ఎన్సీపీ మ‌ద్ద‌తుతో పాల‌న చేస్తున్న ఉద్ద‌వ్‌కు ఇలానే ఎస‌రు పెట్టొచ్చ‌ని బీజేపీ పెద్ద‌లు వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్టు స‌మ‌చారం.. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


Tags:    

Similar News