భారతీయుల ‘ద డ్రీమ్’ విన్నపాన్ని వైట్ హౌస్ ఓకే చేస్తుందా?

Update: 2021-06-26 03:40 GMT
పుట్టింది భారత్ లోనే అయినా.. బాల్యంలోనే అమెరికాకు వెళ్లి.. పెరిగి పెద్దవారై.. అనర్హతల కారణంగా అమెరికాను వీడాల్సిన సమస్యను ఎదుర్కొంటున్న రెండు లక్షల మంది భారతీయ యువత తాజాగా వైట్ హౌస్ ముందు తమ అభ్యర్థనను పెట్టింది. పేరెంట్స్ కారణంగా అమెరికాలో నివసిస్తున్న వారంతా బలవంతంగా వారి సొంత దేశానికి తరలించే ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమను అమెరికాలోనే ఉండేలా అనుమతించాలని బైడెన్ సర్కారును కోరుతున్నారు.

తాజా లెక్కల ప్రకారం దాదాపు రెండు లక్షల మంది భారతీయ యువత అమెరికాలో తమ బాల్యాన్ని.. టీనేజ్ ను గడిపేశారు. వీరంతా 21 ఏళ్లు దాటిన నేపథ్యంలో తమ పేరెంట్స్ వీసాపై అమెరికాలో ఉండేందుకు అనర్హత వేటు పడనుంది. తమ తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు లేనందున.. వారీ సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డు జారీలో కోటాను అమలు చేస్తున్న నేపథ్యంలో ఎంతోమంది తమ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు.

వాస్తవానికి మైనర్లుగా ఉన్నప్పుడు అమెరికాకు వచ్చి.. అక్కడే మేజర్లుగా అయ్యాక అమెరికాను వదిలి వెళ్లాల్సిన అవసరం లేకుండా గతంలో ఒబామా ప్రభుత్వం ‘డాకా’ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ ముడ్ అరైవల్స్) చట్టం కింద తమలాంటి వారు అమెరికాలో ఉండేందుకు మార్పులు చేయాలని కోరుతున్నారు. అయితే.. ఈ చట్టాన్ని ట్రంప్ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. దీంతో.. ఇప్పుడు అమెరికాను వదిలి వెళ్లాల్సిన సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో వారంతా ఒక తాటి మీదకు వచ్చారు. ‘ద డ్రీమ్’ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి.. అమెరికాలో తమను ఉంచాలని కోరుతూ తాజాగా వైట్ హౌస్ కు ఒక అభ్యర్థనను పంపారు. అంతేకాదు.. పలువురు సెనేటర్లు.. కాంగ్రెస్ సభ్యులను కలిసి ఈ విషయంపై లాబీయింగ్ షురూ చేశారు. వారి వేదనను విన్న చట్టసభ సభ్యులు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. మరి.. మనోళ్ల అమెరికాలోనే ఉండాలన్న ఆకాంక్ష నెరవేరుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News