తప్పినోళ్లకు మళ్లీ పరీక్షలా? అలా గట్టెక్కించేస్తారా?

Update: 2020-06-19 03:45 GMT
మొన్న ఏపీలో.. నిన్న తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్షలు అన్నాక పాస్ అయ్యే వారికి తగ్గట్లే.. అంతో ఇంతో ఫెయిల్ అయ్యే వారు ఉంటారు. మామూలు రోజుల్లో ఫెయిల్ అయ్యే వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే పరిస్థితి. ఇప్పుడున్నప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించటం సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అందునా.. మహమ్మారి అంతకంతకూ చెలరేగిపోతున్న నేపథ్యంలో.. రానున్నరోజులు మరింత గడ్డుగా మారటం ఖాయం.

ఇలాంటి వేళలో.. ఫెయిల్ అయిన వారి భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ నుచూస్తే.. ఫెయిల్ అయ్యే వారికి పరీక్షలు పెట్టే ఉద్దేశం ఇంటర్ బోర్డులకు లేదన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిన వారికి మరోసారి పరీక్షలు నిర్వహించకుండా.. గ్రేస్ మార్కులతో గట్టెక్కించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

మొదటి సంవత్సరం ఫెయిల్ అయిన వారికి తర్వాత పరీక్షలు నిర్వహించే వీలు ఉంటుంది. కాబట్టి.. వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ.. సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిన వారిదే అసలు సమస్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదు కాబట్టి.. వారికి గ్రేస్ మార్కులు ఇచ్చేసి.. ఈ ఏడాదికి గట్టెక్కించటం మినహా మరో మార్గం లేదంటున్నారు. అదే జరిగితే.. పరీక్షలంటే భయపడే వారికి భారీ ఉపశమనంగా మారుతుందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News