మినిస్టర్ వంగవీటి....?

Update: 2021-12-29 01:30 GMT
వంగవీటి.. ఈ పేరులోనే ఏదో పౌరుషం కనిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో ఈ పేరు నలగని రోజు అంటూ ఉండదు. వంగవీటి మోహన రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కేవలం నాలుగేళ్లు మాత్రమే చేశారు. ఇక ఆయన దానికి ముందు ఒక తడవ  కార్పోరేటర్ గా పనిచేశారు. కానీ రంగా అంటే ఒక పొలిటికల్  వైబ్రేషన్. ఆయన ఒక బిగ్ సౌండ్. ఆయన చుట్టూనే రాజకీయం అంతా తిరుగుతూ వస్తోంది. రంగా గతించి 33 ఏళ్ళు గడచినా కూడా ఆ మార్క్ ఇంకా నానాటికీ బలపడుతూనే ఉంది. రానున్న రోజుల్లోనూ రంగా జపం చేయక తప్పని పరిస్థితి ఏపీ రాజకీయానికి ఉంది.

ఇక ఆయన వారసుడు రాధాక్రిష్ణ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. రంగాకు మిత్రుడుగా ఉన్న వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా రాధాక్రిష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు.  ఆ తరువాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయింది లేదు. 2009, 2014లలో వరసగా ప్రజారాజ్యం, వైసీపీల నుంచి పోటీ చేసినా ఓటమి పలకరించింది. ఇక 2019 ఎన్నికల ముందే వైసీపీ నుంచి ఆయన దూరం అయ్యారు. టీడీపీలో టికెట్ దక్కలేదు. ఆ పార్టీ ఓటమితో వారు ఇస్తారన్న ఎమ్మెల్సీ హామీ కూడా గాలికి కొట్టుకుపోయింది.

మరి రాధా రాజకీయ అడుగులు ఇపుడు ఎటు పడబోతున్నాయి అంటే కచ్చితంగా వైసీపీ వైపే అంటున్నారు. ఆయన టీడీపీలో అసలు ఇమడలేకపోతున్నారుట. తన తండ్రిని చంపించిన పార్టీ అన్న ఆరోపణలు ఉండడంతో రాధా అందులో చేరిన మీదట రంగా రాధా మిత్రమండలి సభ్యులే ఆయనకు సగానికి సగం దూరం అయ్యారని చెబుతారు. ఇక కరడుకట్టిన రంగా అభిమానులు సైతం రాధా టీడీపీలో ఉండడాన్ని తప్పుపడుతున్నారు. మొత్తానికి రాధా వచ్చే ఎన్నికల వేళ మళ్లీ రాజకీయంగా హైలెట్ కావాలని చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆయన్ని వైసీపీ వైపు తీసుకువచ్చే బాధ్యతను మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్నారని టాక్. వారిద్దరూ ఈ మధ్య జరిగిన రంగా వర్ధంతి వేళ రాధాతో మంతనాలు సాగించారు. ఆ సందర్భంగానే రాధా తనకు ప్రాణ హాని ఉందని సంచలన ప్రకటన చేశారు. తన ఇంటి ముందు రెక్కీ నిర్వహించారు అని కూడా చెప్పాడు. దాని మీద కొడాలి నాని ముఖ్యమంత్రి జగన్ కి తెలియచేశారట. దాంతో టూ ప్లస్  టూ సెక్యూరిటీ అయితే రాధాకు అర్జంటుగా వచ్చేసింది. ఇక రాధా చేసిన ఆరోపణల మీద విచారణ జరుపుతామని డీజీపీ గౌతం సవాంగ్ లేటెస్ట్ గా  ప్రకటించారు.

ఇలా ప్రభుత్వం రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తోంది. అదే టైమ్ లో ఆయన టెక్నికల్ గా ఇప్పటికీ  టీడీపీలోనే ఉన్నారు, కానీ ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం పట్ల కూడా పొలిటికల్ గా అతి పెద్ద  చర్చ సాగుతోంది. అయితే తొందరలోనే రాధా వైసీపీ కండువా కప్పుకుంటారు అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కూడా తెలుస్తోంది. ఆ మీదట మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

రాధా సైతం ముందు ఎమ్మెల్సీగా చేరి  మంత్రిగా బాధ్యతలు చూస్తూ 2024 నాటికి తాను కోరుకున్న చోట నుంచి ఎమ్మెల్యేగా  పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఈ మేరకు వైసీపీ నుంచి హామీ వచ్చిందని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే కొత్త ఏడాదిలో మొదటి రోజుల్లోనే రాధా వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు కీలకం. ఆ సామాజిక సమీకరణలు ఏపీ రాజకీయాల్లో  బాగా పనిచేస్తాయి. అందుకే కాపులకు ఐకాన్ గా ఉన్న రంగా కుమారుడికి పెద్ద పీట వేయడం ద్వారా వైసీపీ అందరి కంటే ముందే తన ట్రంప్ కార్డుని బయటకు తీయనుంది అంటున్నారు. ఇదే కనుక జరిగితే వంగవీటి ఫ్యామిలీలో ఫస్ట్ మినిస్టర్ గా రాధా రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి.
Tags:    

Similar News