ఎఫ్‌బీలో మాత్రమే.. అల్లుడి గారి ఆగ్రహం!!

Update: 2015-09-15 04:24 GMT
ఆయన ఏదీ అఫీషియల్‌ గా చెప్పడు. కాగితం మీద అధికారికంగ చెబితే.. అది ఎటు టర్న్‌ తీసుకుని ఏం తలనొప్పి తెచ్చిపెడుతుందో.. అని ఆయనలో ఒక భయం. కానీ.. చెప్పకపోవడం వలన దేశవ్యాప్తంగా పరువు పోతున్నదని మరో పక్క భయం. ఇలా రెండు భయాల మధ్య ఆయన ఫేస్‌ బుక్‌ లో మాత్రం.. ప్రభుత్వం తీరుమీద విపరీతంగా తన ఆగ్రహావేశాలను వెళ్లగక్కేస్తూ ఉంటారు. ఆయన మరెవ్వరో కాదు.. సోనియా అల్లుడుగారు! కేవలం తన హోదా అదొక్కటే కావడం వల్ల మాత్రమే.. సదరు హోదాను కూడా కోట్‌ చేయాల్సిన అవసరం లేకుండా.. దేశీయ విమానాశ్రయాలు అన్నిటిలోనూ పదేళ్లపాటూ.. తనిఖీలు లేకుండా ప్రయాణించే వీవీఐపీ సదుపాయాల్ని అనుభవించిన రాబర్ట్‌ వాద్రా.. ఇప్పుడు అదే హోదా.. తన పరువు తీసేస్తూ ఉండేసరికి కంగారు పడిపోతున్నాడు.

దేశీయ విమానాశ్రయాల్లో రాష్ట్రపతి - గవర్నర్‌ - సీఎం లు ఇలా చాలా పెద్దస్థాయి వ్యక్తులకు మాత్రం.. తనిఖీలు లేని ప్రయాణం చేయడానికి అధికారం ఉంటుంది. సోనియా ఏలుబడి సాగిన రోజుల్లో రాబర్ట్‌ వాద్రాకు ఎలాంటి హోదా లేకపోయినా.. ఆయన పేరిట ఇలాంటి హక్కు కల్పించారు. దాన్ని ఎయిర్‌ పోర్టుల్లో బోర్డుల్లో కూడా రాయించారు. ఆయనకు ఆ హక్కు ఎలా ఇస్తారంటూ అప్పటినుంచి రగడ సాగుతూనే ఉన్నా.. వాద్రా పట్టించుకోలేదు.

మోడీ సర్కారు వచ్చిన తర్వాత.. దాన్ని తొలగించడానికి హోం శాఖ.. విమానయానశాఖకు ఒక లేఖ రాసింది. ఆ శాఖ అది తమ పనికాదని ఊరుకుంది. ఈలోగా తన పరువు పోతున్నదని.. వాద్రా 'నేను వీఐపీని కాదు.. నా పేరు తీసేయండి' అంటూ కేంద్రాన్ని కోరాడు. ఇదివరలోనే ఓ లేఖ రాశాను అని ఆయన ప్రకటించారు. ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు తాజాగా ఆయన ఈ విషయంలో ఆగ్రహించారు. తన పేరు తీసేయకుంటే.. తానే దేశంలోని ప్రతి ఎయిర్‌ పోర్టుకు వెళ్లి తన పేరు మీద తెల్ల స్టిక్కర్‌ అంటించి దానిమీద సంతకం చేసి వస్తానంటూ.. ఫేస్‌ బుక్‌ లో చాలా తీవ్రమైన కోపం ప్రదర్శించాడు. అయితే ఇలా ఫేస్‌ బుక్‌ లో కోప్పడే బదులు తమ శాఖకు ఒక లేఖ రాస్తే చాలు కదా.. మూడురోజుల్లోనే ఆయన పేరును తొలగించేస్తాం కదా.. అంటూ పౌరవిమానయాన శాఖ మంత్రి మహేశ్‌ శర్మ స్పందించడం.. వాద్రాకు ఇబ్బందికరమే. సర్కారుకు లేఖ రాయకుండా.. అల్లుడుగారు ఇలా ఫేస్‌ బుక్‌ లో గొంతు చించుకోవడం ఎందుకో మరి!
Tags:    

Similar News