పవన్‌పై వైసీపీ వ్యూహం ఫలిస్తుందా?

Update: 2022-10-20 10:30 GMT
తమకు ఏకుకు మేకులా తయారైన పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. విశాఖలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన తీవ్ర ఉద్రికత్తలు రేపడం, ఆ తర్వాత మంగళగిరి వచ్చిన పవన్‌ వైసీపీ నేతలపై నా కొడకల్లారా అంటూ నిప్పులు కక్కడం, ఇంట్లో నుంచి ఒక్కోడిని లాక్కొచ్చి కొడతానంటూ వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేయడం తదితర పరిణామాలతో ఏపీ వర్షాకాలంలోనూ హీటెక్కిపోయింది.

ఈ పరిణామాల వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ వచ్చి పవన్‌ కల్యాణ్‌తో భేటీ కావడం, జగన్‌ ప్రభుత్వం పవన్‌తో వ్యవహరించిన తీరును ఖండించడం జరిగిపోయాయి. అంతేకాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలతోపాటు ఇతర పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తామని పవన్, చంద్రబాబు ప్రకటించారు.

ఈ పాయింట్‌ను వైసీపీ తన అస్త్రంగా చేసుకుంటోంది. పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ స్టారేనని, చంద్రబాబుకు దత్తపుత్రుడేనని మరోసారి ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఈ విషయాన్ని మొదటి నుంచి తాము చెబుతూనే ఉన్నామని గుర్తు చేస్తోంది.

 పవన్‌ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి కావాలని లేదని.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ఆయన లక్ష్యమని అంటోంది. తన అభిమానులను, కాపు సామాజికవర్గాన్ని చంద్రబాబుకు గంగగుత్తగా అమ్మేయడమే పవన్‌ లక్ష్యమని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌తో తాజా భేటీ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

ఈ విమర్శల ద్వారా జనసేన శ్రేణుల్లో, పవన్‌ అభిమానుల్లో, కాపు సామాజికవర్గంలో చీలిక తేవొచ్చని వైసీపీ భావిస్తోంది. పవన్‌ ఇంకా చంద్రబాబు జేబులో మనిషే అని కొంతమందైనా భావిస్తే తమకు మేలు కలుగుతుందని వైసీపీ భావిస్తోందని అంటున్నారు.

అయితే గత ఎన్నికల సమయంలోనే ఈ అస్త్రాన్ని వైసీపీ వాడేసింది. ఈ ఆరోపణలతోనే జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చింది. మళ్లీ అదే పాట పాడితే ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది కాలమే చెప్పాలి.

అలాగే టీడీపీ విషయంలోనూ వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. హార్డ్‌కోర్‌ కమ్మల్లో చంద్రబాబుపైన వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మళ్లీ చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌ కాళ్ల దగ్గరకు వెళ్లాడని.. వారిలో ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని తట్టిలేపడానికి వ్యూహం రచించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వైసీపీ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

అయితే గతంలోనే టీడీపీ, జనసేనల విషయంలో ఈ అస్త్రాన్ని గరిష్ట స్థాయిలో వాడుకునే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. మళ్లీ ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు పవన్‌ అనే ఆరోపణలను ప్రజలు నమ్ముతారా అంటే కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News