ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మీ లెక్క ఏది?

Update: 2015-12-30 11:29 GMT
లెక్క‌ల్ని విప‌రీతంగా ఇష్ట‌ప‌డే వారికి ఇప్పుడో పెద్ద ఇబ్బందే. ఎందుకంటే.. అంకెలు ఆడే ఆట‌లెన్నో. త‌మ‌కు అనుకూలంగా అంకెల్ని చూపించుకునే అవ‌కాశం ఉంటుంది. అంకెల‌కు రాజ‌కీయం జ‌త క‌లిస్తే ఇక కావాల్సినంత గంద‌ర‌గోళం. తాజాగా తెలంగాణ‌లో వెల్ల‌డైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల్నే తీసుకుంటే అంకెల‌తో వ‌చ్చే త‌ల‌నొప్పులు ఎన్నో ఇట్టే తెలిసిపోతాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మొత్తం 12 స్థానాల‌కు జ‌రిగాయి. వీటిల్లో 6 ఏక‌గ్రీవం అయిపోయాయి. ఏక‌గ్రీవం అయిన వెంట‌నే విజేత‌లు పండ‌గ చేసుకుంటే.. పోటీ ప‌డ‌లేక నామినేష‌న్ల ద‌శ‌లోనే వెన‌క్కి త‌గ్గిన వారు ఓట‌మి భారంతో నోట మాట రాన‌ట్లు ఉండిపోయారు.

ఇక‌.. పోలింగ్‌ కి మిగిలింది ఆరుస్థానాలు. ఈ ఆరింటికి ఎన్నిక‌లు జ‌రిగాయి. ఓట్ల లెక్కింపు ఈ రోజు జ‌రిగింది. అనూహ్యంగా ఆరు స్థానాలలో నాలుగు అధికార‌ప‌క్షం కైవ‌శం చేసుకుంటే.. రెండింటిని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. గెలుపోట‌ములు లెక్క‌ల ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి కొత్త ఆట మొద‌లైంది. మొత్తం 12 స్థానాల లెక్క‌లోకి వెళితే కాంగ్రెస్ సాధించిన రెండు వెల‌వెల‌బోతాయి. అదే స‌మ‌యంలో.. తాజాగా విడుద‌లైన ఫ‌లితాల లెక్క‌లోకి వెళితే.. కారు కంగుతినే ప‌రిస్థితి.

దీంతో.. గులాబీ ద‌ళం ప‌న్నెండుకు ప‌ది ద‌గ్గ‌ర ఫిక్స్ అయితే.. కాంగ్రెస్ వ‌ర్గాలు మాత్రం ఆరింట రెండు అని చెప్పుకుంటోంది. దీంతో.. ఇప్పుడు ఏ లెక్క‌ను తీసుకోవాల‌న్న‌ది పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. గెలిచి.. పండుగ చేసుకున్న త‌ర్వాత పాత లెక్కేంట‌ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌శ్నిస్తుంటే.. ఎన్నిక‌ల్ని మొత్తంగా చూడాలే కానీ.. ముక్క‌లుగా చూస్తారా అని గులాబీ దండు ధ్వ‌జ‌మెత్తుతోంది. మ‌రి.. ఈ రెండు లెక్క‌ల్లో మీ లెక్క ఏద‌న్న‌ది మీ ఇష్టం.

తాజా విజేత‌లు చూస్తే..

ఖ‌మ్మం                  -   బాల‌సాని లక్ష్మీనారాయ‌ణ (టీఆర్ ఎస్‌)
మ‌హ‌బూబ్ న‌గ‌ర్       -    క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి (టీఆర్ఎస్‌)
మ‌హ‌బూబ్ న‌గ‌ర్       -    దామోద‌ర్ రెడ్డి (కాంగ్రెస్‌)
న‌ల్గొండ                 -    కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్‌)
రంగారెడ్డి                -    న‌రేంద‌ర్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
రంగారెడ్డి                -    శంభీపూర్ రాజు (టీఆర్ ఎస్‌)

(ఖ‌మ్మంలో 1 స్థానానికి.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో రెండు స్థానాల‌కు.. న‌ల్గొండ‌లో ఒక స్థానం.. రంగారెడ్డిలో రెండు స్థానాలకు ఎన్నిక‌లు జ‌రిగాయి)
Tags:    

Similar News