పంచాయితి కార్యాలయానికి పసుపు రంగా ?

Update: 2021-03-02 05:30 GMT
కోడలికి బుద్ది చెప్పి ఓ అత్త తెడ్డు నాకిందనే సామెతుంది. తెలుగుదేశంపార్టీ వ్యవహారం ఇపుడిలాగే ఉంది. పంచాయితి భవనాలకు వైసీపీ రంగులు వేస్తున్నారంటూ ఆమధ్య టీడీపీ నానా గోల చేసిన విషయం తెలిసిందే. పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు వేయటంపై టీడీపీ ప్రభుత్వంపై కోర్టులో కేసులు కూడా వేసింది. అప్పట్లో రంగుల వివాదం ఏ స్ధాయిలో గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే.

సీన్ కట్ చేస్తే మొన్ననే జరిగిన పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు గెలిచిన ఓ పంచాయితికి పార్టీ రంగు అయిన పసుపు వేసేశారు. దాంతో ఇపుడు పాత రంగుల వివాదమే కొత్తగా రివర్సులో మొదలైంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని కనుగులవలస సర్పంచ్ గా టీడీపీ మద్దతుదారులు నూకరాజు గెలిచారు. సర్పంచ్ గా గెలిచిందే ఆలస్యం వెంటనే పంచాయితి కార్యాలయం భవనానికి తమ పార్టీ పసుపు రంగును వేసేశారు.

పంచాయితి భవనానికి ఏ రంగు వేయాలనే విషయంలో నూకరాజు ఎవరినీ అడగకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కనీసం కొత్తగా ఎన్నికైన పంచాయితి పాలకవర్గాన్ని కూడా అడగలేదట. అధికారులకు కూడా రంగుల విషయంలో ఎలాంటి సమాచారం లేదని తెలిసిందే. దాంతో రంగులు వేయటం మొదలుపెట్టిన తర్వాతే అందరికీ తెలిసింది. కొందరు అభ్యంతరం చెప్పినా సర్పంచ్ నూకరాజు పట్టించుకోలేదని సమాచారం.

నూకరాజును చూసి మరికొందరు టీడీపీ మద్దతుదారులు కూడా తాము గెలిచిన పంచాయితిల్లో కార్యాలయాలకు పసుపు రంగులు వేయటానికి ప్రయత్నిస్తున్నారట. అయితే ఇంకొందరు ఎందుకొచ్చిన గొడవన్నట్లుగా ఏమీ మాట్లాడలేదట. ఇదే విషయమై ఆముదాలవలస ఎంపిడీవో పేడాడ వెంకటరాజు మాట్లాడుతు మూడు రోజుల క్రితమే పంచాయితి కార్యాలయానికి పసుపు రంగులు వేసినట్లు చెప్పారు. పార్టీ రంగు తీసేసి తెల్ల రంగు వేస్తామని చెప్పారు.


Tags:    

Similar News