డోక్లాంలో చైనా మళ్లీ...మొదలుపెట్టింది

Update: 2017-10-06 07:22 GMT

డోక్లాం... భార‌త్‌-చైనా- టిటెట్‌ ల మ‌ధ్య ఉన్న ప్రాంతం. ప్రపంచపటం మీద సూదిమొన మోపేంత భూభాగం కూడా కాదు. భూటాన్‌ కు చెందిన ఆ చిన్న భూమి చెక్కమీద చైనా రోడ్డు వేసే నెపంతో కాలు మోపింది. భూటాన్‌ తో రక్షణ ఒప్పందం కలిగిన భారత్ అడ్డువెళ్లింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ. రెండు ఆసియా దిగ్గజాల మధ్య యుద్ధం తప్పదా? అనేంతవరకు వెళ్లింది. చివరకు ఉభయపక్షాలు వెనుకకు తగ్గడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. అయితే పొరుగుదేశం అయిన‌ప్ప‌టికీ కెలుక్కొని అశాంతిని దూరం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న చైనా మ‌రోమారు తన వంకర బుద్ధిని ప్రదర్శించింది.

సిక్కిం సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు చల్లారి నెలరోజులైనా గడువక ముందే మళ్లీ రోడ్డు నిర్మాణానికి దిగింది. డోక్లాంలో ప్రతిష్టంభన ఏర్పడిన ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరంలో చైనా సైన్యం రోడ్డు నిర్మాణంలో బిజీగా ఉంది. అక్కడ ఇప్పటికే ఓ మార్గాన్ని రహదారిగా విస్తరిస్తున్నారు.500 మంది సైనికుల రక్షణ మధ్య కూలీలు రహదారి పనుల్లో నిమగ్నమయ్యారు. గత జూన్‌ లో చైనా-భూటాన్-ఇండియా ట్రైజంక్షన్‌ లోని డోక్లాం వద్ద రహదారి నిర్మాణాన్ని చైనా చేపట్టడాన్ని భారత్ అడ్డుకుంది. భూటాన్‌ కు రక్షణపరమైన సహకారం అందిస్తున్న భారత్.. చైనా చర్యపై ఆందోళన వ్యక్తంచేసింది. ఈశాన్యరాష్ర్టాలను కలిపే చికెన్ నెక్ ప్రాంతానికి డోక్లాం అతి సమీపంలో ఉండడంతో భారత్ రంగ ప్రవేశం చేసి, నిర్మాణ పనుల్ని నిలిపివేయించింది. చైనా యంత్రాలను - బుల్డోజర్లను తిప్పి పంపింది. దీంతో జూన్ 18 నుంచి ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రెండున్నర నెలలపాటు కొనసాగాయి. చివరకు చైనా వెనక్కి తగ్గడంతో ఆ ప్రతిష్టంభన తొలిగింది. అయితే గత ప్రయత్నం విఫలం కావడంతో చైనా ఈసారి మరో మార్గంలో రహదారి నిర్మాణానికి దిగింది.  పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించి వివాదాస్పద రోడ్డు విస్తరణ పనులకు తిరిగి శ్రీకారం చుట్టింది. దీంతో మళ్లీ డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి ముఖ్యంగా డోక్లాం ముక్కోణ జంక్షన్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో భార‌త్ ప్ర‌శంస‌నీయ రీతిలో వ్య‌వ‌హ‌రించింద‌ని అమెరికాకు చెందిన నేవీ యుద్ధ కళాశాలకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఆర్‌ హోమ్స్ కొద్దికాలం క్రితం ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. సరిహద్దుల్లో చైనా భారీగా సైన్యాన్ని మోహరించిన నేపథ్యంలో భార‌త్ పొరుగుదేశం వ‌లే పెంకిత‌నానికి పోకుండా...ప‌రిణ‌తి చెందిన రీతిలో సంయమ‌నం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని త‌న విశ్లేష‌ణ‌లో తేలిన‌ట్లు ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఆర్‌ హోమ్స్ వివ‌రించారు. భార‌తదేశం తీరు వ‌ల్ల చైనా వ్య‌వ‌హ‌రశైలి - దూకుడు - వివాదాస్ప‌ద తీరు అంత‌ర్జాతీయంగా ఆ దేశంపై ఓ ముద్ర‌ను వేశాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ పరిధిలో అదనపు సైనిక బలగాలను మోహరించాలని చూడటం ద్వారా వివాదం కొన‌సాగాల‌ని చైనా చూస్తోంద‌ని  ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఆర్‌ హోమ్స్ విశ్లేషించారు. అనుకున్న‌ట్లుగానే తాజాగా మ‌ళ్లీ కెలికింది.
Tags:    

Similar News