జ‌వాన్ మీద మ‌హిళ చెంప‌దెబ్బ ఇప్పుడు వైర‌ల్‌

Update: 2017-09-16 06:12 GMT
సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇప్పుడు వార్త‌ల తీరే మారిపోయింది.  ప్ర‌పంచంలో ఏ మూల ఏ ఆస‌క్తిక‌ర అంశం చోటు చేసుకున్నా.. వెంట‌నే అది వైర‌ల్ గా మారిపోతోంది. హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే గుర్ గావ్ లో చోటు చేసుకుంది. తాజాగా సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఒక జ‌వానుపై ఒక మ‌హిళ దాడి చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఉదంతం చూస్తే.. ఢిల్లీకి చెందిన 44 ఏళ్ల మ‌హిళ స్మృతి క‌ల్రా భ‌ర్త నుంచి విడాకులు తీసుకొని ఒంట‌రిగా ఉన్నారు. గ‌త శ‌నివారం మ‌ధ్యాహ్నం వేళ‌లో త‌న టాటా ఇండికా కారు తీసుకొని బ‌య‌ట‌కు వెళ్లారు.

అంత‌లోనే ఆమె త‌న ముందు వెళుతున్న ఆర్మీ ట్ర‌క్కును వేగంగా క్రాస్ చేసి.. వాహ‌నం ముందు అడ్డంగా పెట్టేశారు. వేగంగా కారు దిగి ఆర్మీ వాహ‌నం వ‌ద్ద‌కు వెళ్లి.. అక్క‌డి జ‌వాను చెంప ప‌గ‌ల‌కొట్టారు. అత‌ను ఏదో చెప్ప‌బోతున్న స‌మ‌యానికి మ‌రో రెండు దెబ్బ‌లు కొట్టేసి వెన‌క్కి తిరిగి వెళ్లిపోయారు. జ‌రిగిన ఉదంతాన్ని అక్క‌డే కారులో ఉన్న వ్య‌క్తి ఒక‌రు చిత్రీక‌రించి.. సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేయ‌టంతో ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది.

అయితే.. జ‌వానుపై ఆమె ఎందుకు దాడి చేసింద‌న్న‌ది ఇప్పుడు అర్థం కానిదిగా మారింది. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు ఆమెపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్ర‌వేశ పెట్ట‌గా.. న్యాయ‌మూర్తి ఆమెకు బెయిల్ మంజూరు చేశారు.

ఇదిలా ఉంటే.. త‌న‌ను ఎందుకు కొట్టిందో త‌న‌కు అర్థం కాలేద‌ని బాధిత జ‌వాను చెబుతున్నారు. త‌ను ఎందుకు అలా కొట్టిందో తెలుసుకుందామ‌నే లోపే అంతా జ‌రిగిపోయింద‌ని.. త‌న‌ను నోరు తెరిచి మాట్లాడ‌నివ్వ‌లేద‌ని జ‌వాను వాపోయాడు. ఆమెకేమైనా పిచ్చా అని అనుకున్న‌ట్లుగా చెప్పాడు. ఇదిలా ఉంటే.. త‌న వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేసింద‌నే స్మృతి దాడి చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా జ‌వానుపై దాడి చేసిన‌ స్మృతి వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 

Full View
Tags:    

Similar News