గోదావరి మహాపుష్కరాలు విశేష ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. చిన్నాపెద్దా ఆడామగా అన్నతేడా లేకుండా ప్రతి ఒక్కరూ గోదారి దారి తీస్తూ పుణ్యస్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, రోగులు, గర్భిణులు కూడా పుష్కర స్నానానికి వెళ్తున్నారు. మంగళవారం ఇలాగే ఓ నిండు గర్భిణి పుష్కర స్నానానికి వచ్చి అక్కడే పురుడు పోసుకుంది.
144 ఏళ్లకోమారు జరిగే మహా పుష్కరాల్లో పుణ్యస్నానమాచరిస్తే, శుభం కలుగుతుందన్న భావనతో వచ్చిన ఆమె గోదావరమ్మ ఒడిలోనే పండటి బిడ్డను కని ఆ శిశువు పుట్టుకతోనే పుణ్యం సంపాదించిపెట్టింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ కు వచ్చిన ఆమెకు అక్కడే పురిటి నొప్పులు వచ్చాయి. అక్కడున్న వారు, పుష్కర భక్తులకు సేవలందిస్తున్న సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమవుతుండగానే నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో పుష్కరాల భక్తులకు వైద్య సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న వైద్యులు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెకు సుఖ ప్రసవం చేశారు. కాన్పు అనంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారంతా 'అమ్మా....! నీకు పుష్కరుడు పుట్టాడు' అంటూ సంతోషం వ్యక్తంచేశారు.