ఇంట్లో సీసీ కెమెరా త‌ప్ప‌నిస‌రి

Update: 2016-01-13 09:48 GMT
మాన‌వ సంబంధాల‌న్నీ ఆర్థిక సంబంధాలే- బాగా పాపుల‌ర్ అయిన ఓ సామాజిక‌వేత్త చెప్పిన మాట ఇది. అనేక సంద‌ర్భాల్లో ఈ మాట నిజ్జంగా నిజం అనిపిస్తుంటుంది. అలా జ‌రిగితే మాకేంటి? అనే ఆలోచ‌న అంద‌రిలో పెరిగిపోవ‌డం, ఆశ‌తో ఎంత‌కైనా ఒడిగ‌ట్ట‌డం...ఇలా ఎన్నో వికృత ఘ‌ట‌న‌ల‌కు స‌మాజం వేదిక అవుతోంది. మానవ సంబంధాలనే ప్రశ్నించేలా జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఇందుకు నిద‌ర్శ‌నం.

ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్‌ నూర్‌ కు చెందిన సందీప్ ఏడేళ్ల‌ క్రితం సంగీత అనే మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. భార్య సంగీత, తల్లి రాజారాణితో కలిసి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కట్నంకోసం వేధిస్తున్నారని సంగీత ఆరోపించడంతో పెద్దమనుషులతో పంచాయితీ కూడా జరిగింది. తమ మధ్య గొడవలకు అత్తే కారణమని మనస్సులో కోపం పెట్టుకున్న సంగీత తరుచూ రాజారాణిపై దాడి చేస్తోంది. అయితే ఈ విష‌యాన్ని నిరూపించేందుకు సందీప్‌ కు ఆధారాలు లేవు.

భార్య అకృత్యాలను వెలుగులోకి తేవడానికి, ఆమెకు తెలియకుండా తల్లి గదిలో సీసీటీవీ కెమెరాను సందీప్‌ అమర్చాడు. సందీప్ లేని సమయంలో మంచానపడి ఉన్న అత్తను జుట్టుపట్టి కొట్టడం, రాయితో వీపులో బాదడం, మెడకు ఓ తాడు బిగించి చంపేందుకు ప్రయత్నించడం, ఆమెపై కూర్చుని కొట్టడం చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. తల్లిని అతి కిరాతకంగా కొడుతున్న దృశ్యాలను చూసి.. సందీప్ నేరుగా పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసు ఉన్న‌తాధికారులు స్పందిస్తూ వృద్ధురాలిపై అమానవీయంగా ప్రవర్తించిన సంగీతపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అత్త‌పై అరాచ‌కం చేస్తున్న ఈ ఘనురాలి వ్య‌వ‌హారాలు ఇపుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మాన‌వ‌ సంబంధాల విష‌యంలో ఇలా రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌నుషులు ఉన్న నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో ఇంటికో సీసీటీవీ కెమెరా త‌ప్ప‌నిసరి అవుతుందా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి!
Tags:    

Similar News