వైద్య చ‌రిత్ర‌లో అద్భుతం..ఫూణె ఆసుప‌త్రిలో జ‌రిగింది!!

Update: 2018-10-19 06:10 GMT
దేశ వైద్య చ‌రిత్ర‌లోనే అరుదైన శ‌స్త్ర‌చికిత్స ఒక‌టి విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆసియా ఖండంలోనే ఈ త‌ర‌హా ఆప‌రేష‌న్ మొద‌టిసారి ఫూణెలో నిర్వ‌హించారు. ప్రాశ్చాత్య దేశాల్లో మాత్ర‌మే ఇలాంటివి చేశార‌ని.. అలాంటి శాస్త్ర‌చ‌రిత్ర‌లోనే అద్భుంగా భావించే ఆప‌రేష‌న్ ఒక‌టి తాజాగా చోటు చేసుకుంది.

మ‌హారాష్ట్రలోని ఫుణేలోని గెలాక్సీ కేర్ ఆసుప‌త్రిలో ఒక అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌ను నిర్వ‌హించారు. ఏ త‌ల్లి నుంచి అయితే ఒక బిడ్డ పుట్టిందో.. అదే త‌ల్లి గ‌ర్బ‌ సంచిని త‌న‌లో పెట్టుకొని మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. కాస్త తిక‌మ‌క‌గా అనిపిస్తుందా?  వివ‌రంగా చెప్పాల్సి వ‌స్తే..

గుజ‌రాత్ కు చెందిన మీనాక్షికి పెళ్లి జ‌రిగినా.. పిల్ల‌లు లేక‌పోవ‌టంతో వైద్యుల్ని సంప్ర‌దించారు. అయితే.. ఆమెకు గ‌ర్భ సంచి లేద‌న్న చేదు నిజాన్ని గుర్తించారు. దీంతో.. ఆమెకు పిల్ల‌లు పుట్టాలంటే గ‌ర్భ‌ సంచి త‌ప్ప‌నిస‌రి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇత‌ర ప‌ద్ధ‌తులు ఉన్న‌ప్ప‌టికీ.. తన‌కు తానే గ‌ర్భాన్ని పొందాల‌న్న ఆశ‌తో ఆమె ఉన్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఫుణెలోని గెలాక్సీ కేర్ ఆసుప‌త్రి మీనాక్షి త‌ల్లి గ‌ర్భసంచిని మీనాక్షికి అమ‌ర్చారు. త‌న గ‌ర్భ సంచిని దానం చేసేందుకు మీనాక్షి త‌ల్లి ఓకే అన‌టంతో శ‌స్త్ర‌చికిత్స ద్వారా మీనాక్షిలో అమ‌ర్చారు. ఇది జ‌రిగిన త‌ర్వాత కొన్ని నెల‌ల పాటు మీనాక్షిని వైద్యులు త‌మ ప‌ర్య‌వేక్షణ‌లో ఉంచి వైద్యం చేశారు. ఆమె ప‌రిస్థితి మెరుగుప‌డిన త‌ర్వాత ఆమెను గుజ‌రాత్ కు పంపారు.

ఇది జ‌రిగిన కొద్ది రోజుల‌కు మీనాక్షి గ‌ర్భం దాల్చారు. వైద్యుల సూచ‌న‌ల‌తో 32 వారాల 5 రోజుల త‌ర్వాత ఆమె సీజేరియ‌న్ ద్వారా ఒక పాప‌కు జ‌న్మ‌నిచ్చారు. ప్ర‌స్తుతం త‌ల్లి బిడ్డా.. ఆరోగ్యంగా ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ త‌ర‌హా వైద్య చికిత్స దేశంలోనే కాదు.. ఆసియా ఖండంలోనే ఏ ఆసుప‌త్రిలోనూ జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నారు. తాజాగా తాము చేసిన శ‌స్త్ర‌చికిత్స దేశ వైద్య రంగంలోనే ఒక అద్భుతంగా నిలుస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు.
Tags:    

Similar News