ప్రియుడితో పరారైన భార్య.. దారుణ శిక్ష

Update: 2019-04-14 10:30 GMT
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. వేరే కులం వ్యక్తితో వెళ్లినందుకు శిక్షగా ఓ వివాహితకు గ్రామపెద్దలు వింతశిక్షను విధించారు. ఆమెను పట్టుకొచ్చి మరీ దారుణంగా హింసించారు.

భర్త ఉండగానే వేరు కులం వ్యక్తితో పారిపోయినందుకు శిక్షగా భర్తను ఆమె భుజాలపై ఎక్కించి ఊరంతా తిప్పారు. భర్తను భుజాలపై ఎక్కించుకొని ఆమె నడుస్తూ వెళ్తుంటే గ్రామస్థులు కొందరు డ్యాన్సు చేస్తూ.. గుంపుగా ఎంజాయ్ చేసేవారు. అతడి బరువును మోయలేక ఆమె ఆగితే వెంటనే చుట్టూ ఉన్న జనం అదిలించి బెదిరించి కర్రలతో దాడి చేశారు. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

ఇది పోలీసుల వరకూ చేరడంతో పోలీసులు కేసు నమోదు చేసి 12మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ వినీత్ జైన్ మాట్లాడుతూ.. 10 రోజుల క్రితం సదురు మహిళ ప్రియుడితో పారిపోయిందని.. 10-12 రోజుల తర్వాత ప్రియుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో భర్తను వెతుక్కుంటూ వచ్చిందని.. ఆమెను తీసుకెళ్లి భర్త కులపెద్దల వద్ద పంచాయతీ పెట్టారని తెలిపారు. భర్తను విడిచివెళ్లినందుకు గాను అతడిని భుజాలపై తిప్పాలని వారు శిక్ష విధించారని తెలిపారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
   

Tags:    

Similar News