పెళ్లయి ప‌ది రోజులే..ప్రియుడితో భ‌ర్త‌ను చంపేసింది

Update: 2018-05-09 05:17 GMT
మ‌నుషుల్లో స్వార్థం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. నేను త‌ప్ప మ‌రేమీ క‌నిపించ‌టం లేదు. నేను.. నా సుఖం ముందు  ఎవ‌రైనా స‌రే.. త‌ర్వాతే అన్న ధోర‌ణి అంత‌కంత‌కూ పెరుగుతోంది. త‌మ సుఖాల కోసం భ‌ర్త‌ల్ని భార్య‌లు.. భార్య‌ల్ని భ‌ర్త‌లు సైతం చంపేస్తున్న దుర్మార్గాలు ఈ మ‌ధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతం మ‌రొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వెలుగు చూసిన ఒక హ‌త్య వివ‌రాలు దిమ్మ తిరిగిపోయేలా ఉండ‌ట‌మే కాదు.. మాన‌వ సంబంధాల మీద స‌రికొత్త ఆందోళ‌న క‌లిగించేలా ఉన్నాయి. శ్రీ‌కాకుళం జిల్లా వీర‌ఘ‌ట్టం మండ‌లం చిట్ట‌పుడివ‌ల‌స‌కు చెందిన గౌరీశంక‌ర్ బీటెక్ పూర్తి చేసి వ‌రంగ‌ల్ లోని ఒక ప్రైవేటు కంపెనీలో ప‌ని చేస్తున్నాడు. అత‌ని మ‌ర‌ద‌లు స‌ర‌స్వ‌తి బీటెక్ చేసింది.

ఇరు కుటుంబాల వారు ఏప్రిల్ 28న వీరిద్ద‌రి పెళ్లి జ‌రిపించారు. బావ‌ను పెళ్లి చేసుకుంటావా? అంటూ అడిగిన త‌ల్లిదండ్రుల‌కు ఓకే చెప్పేయ‌టంతో వారిద్ద‌రి పెళ్లి చేశారు. పెళ్లి త‌ర్వాత ముభావంగా ఉంటున్న స‌ర‌స్వ‌తిని ఎవ‌రూ అనుమానించ‌లేదు. అయితే.. ఆమెకు విశాఖ జిల్లా రోలుగుంట మండ‌లం సంత‌బైరు గ్రామానికి చెందిన మ‌డ్డు శివ‌తో ఫేస్ బుక్ ప‌రిచ‌యం ఉంది. వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఉద‌యించి చాలాకాల‌మే అయ్యింది. త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న పెద్ద‌ల మాట కాద‌లేని ఆమె వారి మాట‌కు ఓకే చెప్పేసింది.

అనంత‌రం ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేయాల‌న్న ప్లాన్ వేసింది. పెళ్లి జ‌రిగి ప‌ది రోజులు కూడా కానప్ప‌టికి భ‌ర్త‌ను వ‌దిలించుకోవ‌టానికి ఆమె వేసిన దారుణ‌మైన ప్లాన్ కు ఫేస్ బుక్ ప్రియుడు మ‌డ్డు శిశ స‌హ‌కారం కూడా ఉంది. ఇరువురు క‌లిసి గౌరీశంకర్ ను హ‌త్య చేసేందుకు ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగా విశాఖ‌కు చెందిన కొంద‌రు కిరాయి హంత‌కుల స‌హ‌కారం తీసుకొని స్కెచ్ వేశారు. ఇవేమీ తెలీని గౌరీశంక‌ర్ త‌న భార్య స‌ర‌స్వ‌తితో క‌లిసి సోమ‌వారం పార్వతీపురం ప‌ట్ట‌ణానికి వ‌చ్చాడు. బైక్ స‌ర్వీసింగ్‌కు ఇచ్చాడు. సాయంత్రం బైక్ తీసుకొని తిరిగి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఏవో కార‌ణాలు చెప్పి చీక‌టి ప‌డే వ‌ర‌కూ పార్వ‌తీపురంలో గ‌డిపేలా చేసింది. ముందుగా అనుకున్న ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యంలో పార్వ‌తీపురం  నుంచి బ‌య‌లుదేరిన వారు హ‌త్య చేసే స్పాట్ ద‌గ్గ‌ర‌కు చేరుకోగానే.. తన‌కు బాత్రూం స‌మ‌స్య ఉంద‌ని చెప్పి బైక్ ఆపించింది. అక్క‌డే ఉన్న కిరాయి హంత‌కులు గౌరీశంక‌ర్ నెత్తి మీద రాడ్ తో బ‌లంగా కొట్ట‌టంతో అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. అనంత‌రం త‌న న‌గ‌ల్ని కొన్నింటిని కిరాయిమూక‌కు ఇచ్చేసిన స‌ర‌స్వ‌తి.. గాజులు ప‌గ‌ల‌కొట్టుకొని త‌న‌పై దాడి జ‌రిగిన‌ట్లుగా భావించేలా త‌యారై.. రోడ్డు మీద ఏడుస్తూ కూర్చుంది.

దోపిడీ దొంగ‌లు త‌న భ‌ర్త‌ను మ‌ట్టుపెట్టార‌న్నట్లు చిత్రీక‌రించేలా ప్లాన్ చేసిన‌ట్లుగా భావించిన స‌ర‌స్వ‌తి భ‌ర్త మృత‌దేహం వ‌ద్ద కూర్చొని ఏడ‌వ‌సాగింది. ఆ వైపు వెళుతున్న ఆర్ ఐ.. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. హుటాహుటిన బ‌య‌లుదేరిన వారు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

రోటీన్ గా అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు పొంత‌న‌లేని రీతిలో స‌ర‌స్వ‌తి స‌మాధానాలు చెప్ప‌టం.. అనుమానం వ‌చ్చిన పోలీసులు ఆరాగా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అస‌లు నిజం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. హ‌త్య నేప‌థ్యంలో దోపిడీగా భావించి అలెర్ట్ అయిన పోలీసులు అన్ని రోడ్ల‌లో త‌నిఖీలు ముమ్మ‌రం చేయ‌గా.. కిరాయి హంత‌కులు దొరికిపోయారు. త‌మ‌దైన రీతిలో పోలీసులు ప్ర‌శ్నించ‌టంతో అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. పెళ్లై ప‌ది రోజులు కాకుండానే ఫేస్ బుక్ ప్రియుడి కోసం భ‌ర్త‌ను చంపించిన వైనం సంచ‌ల‌నంగా మార‌గా.. అంత ఇష్టం లేని పెళ్లికి మారు మాట్లాడ‌కుండా ఎందుకు ఒప్పుకున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News