రైల్వే మంత్రి ట్విట్టర్ కు సమస్య పోస్ట్ చేస్తే..?

Update: 2015-11-28 16:24 GMT
రైల్వే అధికారులు ఎంత అలెర్ట్ గా ఉన్నారో తెలియజెప్పే ఘటన ఇది. అయితే.. రైల్వే మంత్రిగారు సీన్లో ఉండటంతో అంత అలెర్ట్ అయ్యారా అన్నది ఒక వాస్తవమైతే.. ఒక ట్వీట్ కు ఈ రేంజ్ లో రియాక్ట్ కావటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆసక్తిని రేపుతోంది.

రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ట్విట్టర్ అకౌంట్ కు చేసిన అనుబంధ ట్వీట్ పెద్ద హడావుడే సృష్టించింది. ‘‘18030 రైల్లో ప్రయాణిస్తున్నాను.. ఓ ప్రయాణికుడి వ్యవహారశైలి ఏ మాత్రం బాగోలేదు. ప్రస్తుతం నేను ప్రయాణిస్తున్న రైలు ముంబయి శివారు షిగావు స్టేషన్ దాటింది’’ అంటూ ఒక మహిళా ప్రయాణికురాలు ట్వీట్ చేశారు.

అంతే.. యావత్ అధికార యంత్రం ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. ఆమె ప్రయాణిస్తున్న రైలు బండి తర్వాతి స్టేషన్ కి వెళ్లేసరికి.. అధికారులు సిద్ధంగా ఉండటంతోపాటు.. ట్వీట్  చేసిన ప్రయాణికురాలిని గుర్తించి.. ఆమె ఇబ్బంది పడుతున్న వ్యక్తిని పక్క బోగీకి తీసుకెళ్లి.. అతని గురించి ఆరా తీశారు.

వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న అతగాడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో తానీ ట్వీట్ చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు. రైల్వే మంత్రి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ట్వీట్ కు ఇంత క్విక్ రెస్పాన్స్ రావటంపై పలువురు స్పందిస్తున్నారు. అయితే.. ఏదైనా ఎమెర్జెన్సీ అంశానికి సంబంధించి సాయం కోరుకుంటే ‘‘182’’కు ఫోన్ చేయాలంటూ  అధికారులు చెబుతున్నారు. ఈ ఉదంతం చూస్తే కేంద్రమంత్రి వర్యుల ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ అయ్యే అప్ డేట్స్ మీద చాలా అలెర్ట్ గా ఉన్నట్లుగా స్పష్టమవుతుంది.
Tags:    

Similar News