ఐటీ ఉద్యోగిని దారుణంగా కాల్చేశారు

Update: 2017-05-31 16:24 GMT
ఒక మ‌హిళా ఐటీ ఉద్యోగిని దారుణ హ‌త్య‌కు గురైంది. తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ బేస్ మెంట్ లోనే ఆమెను ఓ దుండ‌గుడు కాల్చి చంపారు. 23 ఏళ్ల అంజ‌నీ రాథోర్ నోయిడా సెక్టార్ లో నివాసం ఉంటున్నారు. ఆమె లావా మొబైల్ కంపెనీలో ట్ర‌యినీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ప‌ని చేస్తున్నారు. హ‌ర్యానా య‌మునా విహార్‌ కు చెందిన ఆమె ఉద్యోగ‌రీత్యా నోయిడాలో ఉంటున్నారు.

శ‌తాబ్ది విహార్‌ లోని ఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్న అంజ‌నీతో మ‌రో ఆరుగురు మ‌హిళ‌లు క‌లిసి ఉంటున్నారు. ఒక ఫోన్ కాల్ రావ‌టంతో ఆమె అపార్ట్ మెంట్ బేస్ మెంట్‌ లోకి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇంత‌లో ముఖానికి ముసుగు ధ‌రించిన ఒక యువ‌కుడు బైక్ మీద‌కు వ‌చ్చి.. చాలా ద‌గ్గ‌ర నుంచి కాల్పులు జ‌రిపిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆమెపై కాల్పులు జ‌రిపిన వైనం.. పార్కింగ్ ఏరియాలోని సీసీ టీవీలో న‌మోదైంది. నోయిడా సెక్టార్ లోని అంజ‌నీ రాథోర్ హత్య ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. కాల్పులు జ‌రిగిన వెంట‌నే స్పందించిన అక్క‌డి వారు ఆమెను హుటాహుటిగా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లుగా వైద్యులు వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే.. ఆమెను అంత దారుణంగా హ‌త్య‌కు గురి చేయాల్సిన అవ‌స‌రం ఏమిట‌న్న కోణంలో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. విచార‌ణ‌లో భాగంగా అంజ‌లి రూమ్ మేట్స్ ను పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఉద‌యం ఫోన్ కాల్ రావ‌టంతో అంజ‌లి కింద‌కు వెళ్లింద‌ని.. అంత‌లోనే ఈ దారుణం చోటు చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News