ట్రంప్‌కు వేలు చూపించింది.. జాబ్ ఊడింది

Update: 2017-11-07 09:01 GMT
అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ను తిట్టిపోసే వారిలో అమెరిక‌న్లు భారీగా ఉంటారు. ఆయ‌న నీడను కూడా ఇష్ట‌ప‌డ‌ని వారెంద‌రో. అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ ఎలా అయ్యార‌న్నది ఇప్ప‌టికి త‌మ‌కు అర్థం కావ‌టం లేదంటూ తోపుల్లాంటి అమెరికా మీడియా సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌ముఖులు కొన్ని ముఖ్య‌మైన స‌ద‌స్సుల్లో  నేటికీ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. ట్రంప్ మీద కొంద‌రు అమెరిక‌న్ల‌కు ఎంత‌టి వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించే వైనం ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలో ఇదో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది.

ఒక మ‌హిళ సైకిల్ మీద త‌న దారిన తాను వెళుతోంది. ఆమె ప‌క్క‌గా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న కాన్వాయ్ తో క‌లిసి గోల్ఫ్ కోర్సుకు వెళుతున్నారు. వాహ‌నాలు ఆమెను దాటుతున్న వేళ ఆమె.. త‌న చేతి మ‌ధ్య వేలును పైకెత్తి ట్రంప్ కాన్వాయ్ వైపు చూపించింది. దీన్ని వెంట‌నే క్లిక్ మ‌నిపించాడు కాన్వాయ్ లోని ఒక ఫోటోగ్రాఫ‌ర్‌. దాన్ని వ‌దిలేయ‌కుండా సోష‌ల్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

అమెరికా అధ్య‌క్షుడు అంత‌టోడికి అలా వేలెత్తి చూపించిన ఫోటో వైర‌ల్ అయ్యింది. దాంతోపాటు.. అలా వేలెత్తి చూపించిన ఆవిడ ఎవ‌ర‌న్న వెదుకులాట మొద‌లైంది.  ఆమె ధైర్య‌సాహ‌సాల‌కు మెచ్చిన వారెంద‌రో. చివ‌ర‌కు అమెరిక‌న్ కామెడీ టీవీ సీరియ‌ల్స్ లోనూ ఆమె చేసిన ప‌ని ప్ర‌స్తావించారు. మ‌రింత ప్ర‌చారం జ‌రిగిన త‌ర్వాత స‌ద‌రు  మ‌హిళ ఎవ‌ర‌న్న‌ది బ‌య‌ట‌కు రాకుండా ఉంటుంది?  ట్రంప్ పై త‌న నిర‌స‌న‌ను తెలియ‌జేసిన మ‌హిళ పేరు జూలీ బ్రిస్క్ మ్యాన్ అని తేల్చారు. 50 ఏళ్ల వ‌య‌సున్న ఆమె.. అకీమా అనే కాంట్రాక్ట‌ర్ వ‌ద్ద మార్కెటింగ్‌.. క‌మ్యూనికేష‌న్ స్పెష‌లిస్ట్ గా ఆర్నెల్లుగా ప‌ని చేస్తున్నార‌ట‌.

అధ్య‌క్షుల వారికి వేలెత్తి చూపించిన వైనానికి ఆగ్ర‌హించిన కంపెనీ.. జూలీని ఉద్యోగంలో నుంచి తీసేశాయి. అదేమంటే.. సోష‌ల్ మీడియా పాల‌సీని ఉల్లంఘించిన‌ట్లుగా చెబుతూ.. ప్ర‌భుత్వ కాంట్రాక్ట‌ర్ గా త‌మ‌కున్న పేరు జూలీ కార‌ణంగా దెబ్బ తిందంటూ చెప్పింది.

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన జూలీ జ‌రిగిన దానికి అస్స‌లు ఫీల్ కావ‌టం లేదు. ట్రంప్ పై త‌న‌కున్న ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు తాను చేసిన ప‌నికి ఆమె అస్స‌లు చింతించ‌టం లేద‌ట‌. పైగా.. త‌న బాధ‌ను చెప్పుకున్నానంటూ ఆనందిస్తోంద‌ట‌. ప్ర‌స్తుతం కొత్త ఉద్యోగాన్ని వెతుక్కునే ప‌నిలో ప‌డిన ఆమెను.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసి రాజ‌కీయాల్లోకి రావాలంటూ కోరుతున్న నెటిజ‌న్లు ఉన్నారు. ఈ స‌ల‌హాలు.. సూచ‌న‌ల క‌న్నా ఆమెకు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవ‌టం ఇప్పుడు ముఖ్య‌మ‌ని  అర్థం చేసుకుంటే మంచిదేమో?
Tags:    

Similar News