`ఢిల్లీ మెట్రో` వైర‌ల్ పిక్ స్టోరీ...రియ‌ల్ కాద‌ట‌!

Update: 2018-01-25 17:59 GMT
చేతిలో స్మార్ట్ ఫోన్....అందుబాటులో మొబైల్ డేటా ఉంది క‌దా అని కొంద‌రు సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. అంతటితో ఆగితే ప‌ర్లేదు....త‌మ ఫోన్ తో ఎదుటివారి అనుమ‌తి లేకుండా ఫొటోలు తీయ‌డ‌మే కాకుండా....వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి త‌మ‌కు న‌చ్చిన వ‌క్ర‌భాష్యాలిచ్చేయడం ఈ మ‌ధ్య కాలంలో ఫ్యాష‌న్ అయిపోయింది. అయితే, వాటిలో కొన్ని వాస్త‌వాలున్నప్ప‌టికీ.....వైర‌ల్ కావ‌డం కోసం ఉన్న‌వీ లేనివీ పోస్ట్ చేసేవారే ఎక్కువ‌గా ఉండ‌డంతో సోష‌ల్ మీడియాలో వ‌చ్చే పోస్టుల‌లో చాలావాటికి విశ్వ‌స‌నీయ‌త ఉండ‌డం లేదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఇంత పాపుల‌ర్ అయిన‌ప్ప‌టికీ.....క్రెడిబులిటీ లేక‌పోవ‌డంతో అది ప్ర‌ధాన మీడియాకు ప్ర‌త్యామ్నాయం కాలేక‌పోతోందన్న‌ది నిపుణుల వాద‌న‌. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. ఢిల్లీ మెట్రో రైలులో ధ‌నిక‌ - పేద వ‌ర్గాల మ‌ధ్య అంత‌రం అంటూ......రెండు రోజులుగా ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఢిల్లీ మెట్రో రైలులో ఖాళీగా ఉన్న ఓ బోగీలో ఓ మహిళ తన బిడ్డతో స‌హా సీట్లో కూర్చుని.. ప‌నిమ‌నిషిని మాత్రం కింద కూర్చోబెట్టింది....అంటూ ఓ ఫొటోకు త‌న‌దైన భాష్యం చెబుతూ ఓ యువ‌తి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అయితే, స‌ద‌రు యువ‌తి ఓ జర్నలిస్ట్ కూడా కావ‌డం విశేషం. మీడియా+సోష‌ల్ మీడియాలో `చురుగ్గా`ఉన్న యువ‌తి ఆ పోస్ట్ చేయ‌డంతో అది కొద్ది గంట‌ల్లోనే వైర‌ల్ అయింది. ఆ నోట‌...ఈ నోట ప‌డి....ఆ పోస్ట్ విష‌యం ఆ `క‌సాయి` మ‌హిళ‌కు చేరింది. దీంతో, త‌న బ్లాగ్ లో స్పందించిన ఆమె ఆ ఘ‌ట‌న‌పై సుదీర్ఘ‌మైన వివ‌ర‌ణ ఇచ్చింది.

శనివారం సాయంత్రం మెట్రో రైల్ లో ప్ర‌యాణిస్తోన్న `ది ప్రింట్‌ ఇండియా` రిపోర్టర్‌ సన్య ధింగ్రా ....ఓ మహిళ తన చిన్నారితో సీట్ లో కూర్చొని ఉండ‌గా....ఆమె ప‌నిమ‌నిషి ప‌క్క‌నే కింద కూర్చొని ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. ఆ మ‌హిళ పక్కనే ఖాళీ ఉన్నప్పటికీ ఆమెను కావాల‌నే కింద కూర్చోబెట్టింద‌ని....అది క‌చ్చితంగా వివ‌క్షేన‌ని ట్వీట్ చేసింది. అనూహ్యంగా ఆ ట్వీట్ ను `ది ప్రింట్‌ ఇండియా` సోమవారం సంచికలో ముఖ చిత్రంగా ప్రచురించింది. దీంతో, ఆ మ‌హిళ త‌న బ్లాగ్ లో స్పందించారు. తాను అపోలో ఆస్పత్రిలో వైద్యురాలిగా ప‌నిచేస్తున్నాన‌ని, ఆ రోజు జ‌రిగిన వాస్త‌వాల‌ను వివ‌రించారు. త‌న‌ బిడ్డ, ఆయాల‌తో పాటు తాను మెట్రోలో ఇంటికి వెళుతున్నామ‌ని, త‌మ‌ దగ్గర లగేజీ చాలా ఉంద‌ని తెలిపారు. తాము ఎక్కిన బోగీ ప్రయాణికులతో నిండిపోయి ఉంద‌ని, మహిళలంతా కిందే కూర్చుని ఉన్నార‌ని, ఇది త‌మ‌కు కొత్తేం కాద‌ని చెప్పారు. కొద్ది సేప‌టి త‌ర్వాత త‌మ కోచ్‌ ఖాళీ అవ‌డంతో ఒక మహిళ త‌న‌కు సీటు ఇచ్చింద‌ని, త‌న‌ చిన్నారితో ఆ సీట్ లో కూర్చున్నాన‌ని తెలిపారు.

ఆ స‌మ‌యంలో త‌మ‌ కోచ్ లోకి వ‌చ్చిన స‌న్య‌..... ఆయా(ప‌నిమ‌నిషి)ను పైన కూర్చొమని కోరార‌ని. అప్పటికే అలిసిపోయిన ఆయా....తనకు కింద కూర్చోవటమే బాగుందని బదులిచ్చింద‌ని తెలిపారు. ఆ త‌ర్వాత ఎంజీ రోడ్‌ స్టేషన్ లో దిగి తాము ఇంటికి వెళ్లిపోయామ‌ని చెప్పారు. తాను సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌న‌ని, ఎవ‌రో చెబితే ఆ ట్వీట్ గురించి తెలిసి స్పందిచాన‌ని అన్నారు. తానొక‌ వైద్యురాలిన‌ని - ప్ర‌జాసేవే త‌న‌ కర్తవ్యమ‌ని తెలిపారు. ఆమె త‌మ‌ ఇంట్లో చాలారోజులుగా పని మనిషిగా చేస్తోందని, ఆమెతో ఎలా ప్రవర్తించాలో త‌న‌కు బాగా తెలుస‌ని చెప్పింది. అనుమతి లేకుండా సన్య త‌న ఫొటో తీయడం, వాస్తవాలు తెలుసుకోకుండా శేఖర్‌ గుప్తా (ప్రముఖ జర్నలిస్ట్‌) కథనం రాయటం... సరికాదని చుర‌కలంటించారు. ఏది ఏమైనా....బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన జ‌ర్న‌లిస్టుల నుంచి ఇటువంటి పోస్టులు వెలువ‌డ‌డంపై ప‌లువురు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News