ముస్లింల పోరాటంః పురుషులు వ‌ర్సెస్ స్త్రీలు

Update: 2016-09-04 08:30 GMT
'ట్రిపుల్‌ తలాఖ్‌' అంశం ముదురుపాకాన ప‌డుతోంది. ఈ దురాచారం వల్ల మహిళలకు ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందుల రీత్యా ముస్లిం మ‌హిళ‌లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే అఖిల భారత్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని మహిళా కార్యకర్తలు జీర్ణించుకోలేక‌పోతున్నారు. మ‌హిళల పట్ల ముస్లిం ప‌ర్స‌న‌ల్‌ బోర్డు పూర్తిగా తిరస్కార వైఖరిని అనుస‌రిస్తోందని ఖండించారు. ముస్లిం పర్సనల్‌ చట్టాలు తిరగరాయడానికి వీల్లేదనీ, మతాచారాలపై కోర్టులు తమ అభిప్రాయాలను రుద్దలేవనీ బోర్డు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఎదుట పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ ప‌రిణామంపై భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ (బీఎంఎంఏ) సహ సంస్థాపకురాలు నూర్జహాన్‌ సాఫియా నియాజ్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దేశ పౌరులుగా తమను కోర్టు గడప తొక్కకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆమె స్ప‌ష్టం చేశారు. ట్రిపుల్‌ తలాఖ్‌ పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో ఈ సంస్థ కూడా ఒకటి. 'ఖురాన్‌ లో ముస్లిం మహిళలకు అనేక హక్కులనిచ్చారు. కానీ బోర్డు సభ్యుల్లో వేళ్లూనుకున్న పితృస్వామ్యం మూలంగా మహిళలకు ఎలాంటి హక్కులూ లభ్యం కాకుండా వారిని అణచివేస్తున్నారు' అని ఆమె అన్నారు. బోర్డులోని పురుష‌ సభ్యుల మొండివైఖరితో విసుగు చెందామనీ, అందుకే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందనీ ఆమె చెప్పారు. ట్రిపుల్‌ తలాఖ్‌ ఖురాన్‌ కు వ్యతిరేకమైందని చెబుతూ - విడాకులలో మధ్యవర్తిత్వం తప్పనిసరి అని మత గ్రంథంలోనే ఉందని ఆమె గుర్తు చేశారు. కాగా, సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ దీనిపై మాట్లాడుతూ, 'అనుచితమైన ట్రిపుల్‌ తలాఖ్‌పై మహిళలు చేస్తున్న విజ్ఞప్తులన్నింటినీ పర్సనల్‌ లా బోర్డు పెడచెవిన పెట్టింది' అని అన్నారు.
Tags:    

Similar News