అధికారులు పారాహుషార్.. పోచమ్మ అవ్వలు ఉంటారు

Update: 2019-08-30 06:49 GMT
పోచమ్మ అవ్వ. నిన్నటి వరకూ ఆమె ఎవరో తెలీదు. తన మానాన తాను బతికేది. తనకున్న సమస్యల్ని పరిష్కరించుకోవటానికి రెవెన్యూ అధికారుల వద్దకు రావటం.. వారి చుట్టూ తిరగటం.. బ్రతిమిలాడుకోవటం తప్పించి ఆమెకు ఇంకేమీ తెలీదు. తన పని కావాలంటే అధికారులు అడిగినన్ని పైసలు ఇవ్వాలన్న విషయం కూడా తెలుసు.

సారుకు కోపం వస్తే.. కష్టమని.. వంగి వంగి దణ్ణాలు పెట్టటమే కాదు.. సారూ.. కాస్త చూడూ అంటూ బ్రతిమిలాడేది. అవసరమైనన్ని పైసలు తీసుకొని కూడా పని చేయని అధికారుల చేష్టల్ని ఏడాది పాటు మౌనంగా భరించిన పోచమ్మ.. తాజాగా చెలరేగిపోయింది. శాంతమూర్తికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పోచమ్మ శివాలెత్తిపోయిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల తహిసిల్దార్ కార్యాలయానికి ఏడాదిగా తిరుగుతూనే ఉంది మేడుకుంద గ్రామానికి చెందిన మహిళా రైతు పోచమ్మ. తన పేరు మీద ఉన్న భూమిని కొడుకుల పేరు మీద రాయటాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా అధికారుల తప్పిదాన్ని సరి చేసి న్యాయం చేయాలని కోరగా.. దానికి పైసలు అడగటం.. ఆమె ఇవ్వటం జరిగిపోయాయి.

ఏడాదిగా ఆఫీసుకు వచ్చి వీఆర్వోను ఎంతలా అడిగినా.. ఆయన పని పూర్తి చేయట్లేదు. అదే పనిగా తిప్పిస్తుండటంతో ఆగ్రహానికి గురైన ఆమె.. తాజాగా వీఆర్వో కాలర్ పట్టుకొని కార్యాలయం నుంచి బయటకు లాక్కొచ్చింది. అతడు తనను పెడుతున్న ఇబ్బందుల చిట్టా విప్పింది. ఏడాదిగా తిరుగుతున్నా నా సమస్యను పట్టించుకోవా? అడిగినన్ని పైసలు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు తిప్పుతున్నావ్ అని కడిగేసింది. దీంతో బిత్తరపోయిన అధికారి.. ఆ తర్వాత దురుసుగా ఆమెను తోసేయటంతో ఆమె కింద పడి స్పృహ కోల్పోయింది. దీంతో.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ వైనం స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. ఈ ఉదంతం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది.
Tags:    

Similar News