ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై మహిళా న్యాయవాది సంచలన ఆరోపణలు

Update: 2021-04-19 05:36 GMT
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే కలెక్టర్, అధికారులతో వివాదాలు పెట్టుకున్న ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాజాగా ఓ మహిళా న్యాయవాదిని బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి బెదిరించారని.. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని జనగామ కోర్టు సీనియర్ న్యాయవాది కే. సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ తాజాగా డీసీపీ శ్రీనివాస్ రెడ్డికి మహిళా న్యాయవాది కే.సునీత ఫిర్యాదు చేశారు.

సునీత నివాసముండే 28వ వార్డు గుండ్లగడ్డలో ఓ ముస్లిం ధార్మిక సంస్థ కొత్తగా మసీదు నిర్మాణం ప్రారంభించింది. ఆ నిర్మాణం తన ఇంటి పక్కనే ఉండడంతో భవిష్యత్ లో మతపరమైన గొడవలు వస్తాయని.. పక్కనే గణేశ్ దేవాలయం కూడా ఉందని కాలనీ ప్రజలతో కలిసి సునీత కలెక్టర్ కు, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆ పనులను నిలిపివేయించారు.

ఈ విషయాన్ని ధార్మిక సంస్థ నిర్మాణ సభ్యులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వివరించారు. ఆయన సునీతతోపాటు కాలనీవాసులను క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఈ క్రమంలోనే సునీతను 'ఇంట్లో కూర్చో బయట కనిపిస్తే బాగుండదు. కాలనీ వాళ్లతో కనిపిస్తే నీ అంతు చూస్తా' నంటూ బెదిరించారని.. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని సునీత కోరారు.

* బెదిరించలేదన్న ముత్తిరెడ్డి
మసీదు నిర్మాణం విషయంలో వివాదంపై కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు న్యాయవాది క్యాంపు కార్యాలయానికి పిలిపించానని.. మత సంబంధ విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించాను తప్పితే బెదిరించలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచించాని తెలిపారు.
Tags:    

Similar News