టీడీపీలో మహిళలకు ఛాన్సిస్తారా లేదా..?

Update: 2017-03-03 08:08 GMT
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ సీట్ల వేట మొదలైంది. ఏపీలో టీడీపీకి సంఖ్యా బలం ఆధారంగా పక్కాగా ఐదు స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో పోటీ తీవ్రంగా ఉంది. అందులో ఒకటి ఇప్పటికే  నారా లోకేష్‌ కు రిజర్వ్ అయిపోయింది.  మిగిలిన నాలుగు స్థానాల కోసం అంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నాలుగులో ఒకటి కరణం బలరాంకు ఇస్తారన్న ప్రచారం బాగా జరుగుతోంది.. అది పోగా మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి కచ్చితంగా మహిళలకు ఇస్తారని భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో అయితే పైసా ఖర్చు లేకుండా ఈజీగా  ఎమ్మెల్సీ అయిపోవచ్చన్న ఉద్దేశంతో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
    
మొన్నటి స్థానిక సంస్థల కోటాలో టీడీపీలో ఒక్క మహిళకు కూడా ఛాన్సివ్వకపోవడంతో   ఎమ్మెల్యే కోటాలో టీడీపీ మహిళా నేతలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించినప్పటికి నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్న సినీ నటి కవిత ఈసారి తనకు తప్పనిసరిగా ఎమ్మెల్సీని చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇటీవల పలుమార్లు పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని మీడియా ముందే వాపోయారామె. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా తనను పిలిపించుకునే వారని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. మరి చంద్రబాబు ఆమెకు ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి.
    
అలాగే  టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఈసారి తనకు అవకాశం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే కోటాలో రెండేళ్ల పదవికాలంతో ఎమ్మెల్సీ తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. దీంతో ఈసారి తనకు అవకాశం ఇవ్వాల్సిందేనంటున్నారు. గత ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసి, తర్వాత ఇన్‌ చార్జ్ పదవి కూడా పోగొట్టుకున్న పోతుల సునీత కూడా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పరిటాల రవితో కలిసి తన భర్త పోతుల సురేష్‌ టీడీపీకి చేసిన సేవలను కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి ఎమ్మెల్సీగా రెన్యువల్ కోరుతున్నారు. దీంతో మహిళా కోటా విషయంలోనూ టీడీపీలో గట్టి పోటీ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News