భార‌త్ లో జీఎస్టీ...షాకింగ్ నిజాలు!

Update: 2018-03-15 14:10 GMT

కేంద్ర‌ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా గత జూలై 1 నుంచి జీఎస్టీని అమలులోకి తెచ్చారు. మోదీ స‌ర్కార్ ప్ర‌వేశపెట్టిన జీఎస్టీపై ఆర్థిక నిపుణులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ వంటి దేశానికి జీఎస్టీ సూట్ కాద‌ని - దీని వ‌ల్ల సామాన్య‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని - చిరువ్యాపారులు బ‌జారున ప‌డ‌తార‌ని హెచ్చ‌రించారు. తాజాగా, భార‌త్ లో అమ‌ల‌వుతోన్న జీఎస్టీపై ప్ర‌పంచ‌ బ్యాంక్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రపంచ దేశాల్లో అత్యధిక పన్ను రేటు కలిగిన దేశం భార‌త్ అని స్ప‌ష్టం చేసింది. 115 దేశాల్లో అమ‌లులో ఉన్న పన్ను విధానాలను ప‌రిశీలించిన ప్ర‌పంచ బ్యాంక్ ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. చాలా సంక్లిష్టమైన జీఎస్టీ ప‌న్ను చెల్లింపు విధానాన్ని భార‌త్ ప్ర‌వేశ‌పెట్టింద‌ని అభిప్రాయ‌ప‌డింది.

ప్రపంచ వ్యాప్తంగా జీఎస్టీని అమలు చేస్తున్న దేశాల్లో 49 దేశాలు ఒకే శ్లాబును కలిగి ఉన్నాయని - మరో 28 దేశాలు 2 శ్లాబులను కలిగి ఉన్నాయని తెలిపింది. భారత్ స‌హా మ‌రో 5 దేశాలు మాత్ర‌మే 4 లేదా అంతకంటే ఎక్కువ జీఎస్టీ శ్లాబులు కలిగి ఉన్నాయని - వాటిలో కూడా భార‌త్ అగ్ర‌స్థానంలో ఉంద‌ని చెప్పింది. భారత్‌ లో 0 శాతం - 5 శాతం - 12 శాతం - 18 శాతం - 28 శాతం పన్ను విధానాలతో 5 శ్లాబులు అమ‌ల్లో ఉన్నాయ‌ని తెలిపింది. వాటితోపాటు బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం - విలువైన రాళ్లకు 0.25 శాతం పన్ను విధానం అమలుచేస్తున్నార‌ని చెప్పింది. అయితే, ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆల్క‌హాల్‌ - పెట్రోలియం - స్టాంపు డ్యూటీలు - రియల్‌ ఎస్టేట్‌ - ఎలక్ట్రిసిటీ డ్యూటీలను జీఎస్టీ ప‌రిధి నుంచి మినహాయించారని ప్ర‌పంచ బ్యాంక్ తెలిపింది.
Tags:    

Similar News