కరోనా అదే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించేసింది

Update: 2020-03-12 05:25 GMT
కరోనావైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. చైనా బయట కరోనావైరస్ కేసులు గత రెండువారాల్లో 13 రెట్లు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రాస్ అద్నామ్ గ్యాబ్రియేసస్ తెలిపారు. ప్రమాదకర స్థాయికి చేరిన ఈ వైరస్‌ ఏమీ అరికట్టలేనిది కాదని.. దీన్ని సమర్థంగా అరికట్టవచ్చని, నియంత్రించవచ్చని చాలా దేశాలు నిరూపించాయని ఆయన తెలిపారు. అత్యవసరంగా తీవ్ర చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూనే వినాశనాన్ని తగ్గిస్తూ, మానవ జీవితాలను కాపాడాలంటూ ఆయన పిలుపునిచ్చారు. "మనం ప్రపంచంలోని పౌరులందరినీ కాపాడాలి. మనం ఆ పని చేయగలం"అని ఆయనన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ముప్పుగా పరిణమించే వ్యాధులను ప్రపంచ మహమ్మారిగా ప్రకటిస్తారు. ఇటీవలి కాలంలో చూస్తే 2009లో ఒక్కసారిగా విజృంభించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగా చెప్పవచ్చు. అప్పుడు ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతవరకు గుర్తించని కొత్త వైరస్‌లు, ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకేవి మహమ్మారులుగా మారతాయి. కరోనా వైరస్ ఈ కోవలోకే వస్తుంది.

కరోనా నివారణకు ఇంకా వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి సమర్థమైన చికిత్సలు కానీ ఇంకా అందుబాటులోకి రానందున దీని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. ఇది ప్రజల్లో ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుండడమే కాకుండా చైనా పొరుగు దేశాలంతటా, వాటిని దాటి ఇతర దేశాలకూ వ్యాపించింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, అక్కడి సమాజాల్లో ఇది తరచూ ప్రబలుతున్నట్లుగా గుర్తిస్తే మహమ్మారిగా పేర్కొంటారు.
Tags:    

Similar News