ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్నింగ్ విన్నారా?

Update: 2022-01-06 04:29 GMT
ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా కుటుంబానికి చెందిన వేరియంట్ ఏదైనా సరే.. దాన్ని లైట్ తీసుకోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదేమో. దక్షిణాఫ్రికాలో గుర్తించి.. దాని తీవ్రత గురించి పెద్ద ఎత్తున వార్తలు రావటమే కాదు.. చూస్తుండగానే 125 దేశాలకు పాకేసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది.

మరణాలు తక్కువ.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తక్కువగా ఉంటుందన్న మాటతో.. దీనిపై పుట్టుకొచ్చిన వాదనలు అన్ని ఇన్ని కావు. కొందరు దీన్ని నేచురల్ వ్యాక్సిన్ గా పిలిస్తే.. మరికొందరు దీన్ని వరంగా కీర్తించినోళ్లు ఉన్నారు. ఒమిక్రాన్ మనకు మేలు చేస్తుందని.. దీంతో.. కరోనా కుటుంబానికి ముగింపు కార్డు వేయటమేనన్న అంచనాల్ని వినిపించినోళ్లు ఉన్నారు. అలాంటి వేళ అందుకు భిన్నంగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన తాజా వార్నింగ్ చూస్తే.. దీన్ని తక్కువగా అంచనాలు వేసినోళ్లంతా ఒకసారి పునరాలోచనలో పడాల్సిందే.

ఒమిక్రాన్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని డబ్ల్యూహెచ్ వో హెచ్చరిక జారీ చేసింది. వేరియంట్ ను తొలిసారి గుర్తించిన దక్షిణాఫ్రికాలో రోగులు ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి.. మరణాల రేటు తక్కువగా ఉందని.. అంత మాత్రాన అన్ని చోట్ల ఇలానే ఉంటుందన్న గ్యారెంటీ ఏమీ లేదని పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్ అబ్దీ మహముద్. దక్షిణాఫ్రికాలో మాదిరే అన్నిచోట్ల ఒమిక్రాన్ ఇదే తీరులో ఉంటుందని భావించలేమని స్పష్టం చేశారు.
కరోనా పాత వేరియంట్లు తీవ్రమైన న్యూమోనియాకు దారి తీసి ఊపిరితిత్తల పనితీరుపై ప్రభావం చూపటం తెలిసిందే.

ఒమిక్రాన్ విషయానికి వస్తే..శ్వాస వ్యవస్త పైభాగంపై ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ వాదన సరైనదేనని చెప్పటానికి మాత్రం మరిన్ని అధ్యయనాలు అవసరమని చెబుతున్నారు. అమెరికాలో కేసులు గణనీయంగా పెరగటం.. ఒమిక్రాన్కారణంగా ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్ అబ్దీ పేర్కొనటం గమనార్హం.సో.. ఒమిక్రాన్ కదా అని తేలిగ్గా తీసుకుంటే తిప్పలే అన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది.


Tags:    

Similar News