ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఎయిర్ ఇండియా సేవలు

Update: 2019-04-27 05:55 GMT
పేరు గొప్ప ఊరు దిబ్బగా మారింది ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పరిస్థితి. చెప్పుకోవడానికి ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినా అందులో జరిగినన్ని సంక్షోభాలు ఇంకెక్కడా జరగవు. ఇంధనం కొరత, జీతాల చెల్లింపులో జాప్యంతో పైలెట్ల సమ్మె, నష్టాలు పేరుకుపోయి అమ్మకం దశలో సంస్థ ఇలా ప్రతీ ఆరు నెలలకోసారి వార్తల్లో నిలిచే ఎయిర్ ఇండియాను కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా గట్టెక్కించిన దాఖలాలు కనిపించడం లేదు.

ప్రభుత్వ రంగ సంస్థ కావడం.. ఉద్యోగులు, అధికారులు, విమానాయాన శాఖలో చిత్తశుద్ధి కరువవడంతో తరచూ సంస్థ ప్రతిష్ట దిగజారుతూనే ఉంది. సమస్యలకు  ఆలవాలంగా ఎయిర్ ఇండియా  మారి ప్రయాణికులతో చెడుగుడు ఆడుకుంటోంది.

వరుసగా ఎయిర్ ఇండియాలో వస్తున్న సమస్యలు విమాన ప్రయాణికులకు నరకంగా మారాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానాలన్నీ ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా ప్రధాన సర్వర్ షట్ డౌన్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానాలు నడువక ప్రయాణికులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఎయిర్ ఇండియా సర్వర్ షట్ డౌన్ కావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. శనివారం తెల్లవారుజామున 3.30గంటలకు సిటా సర్వర్ షట్ డౌన్ అయ్యింది. దీంతో భారత్ తోపాటు ఓవర్సీస్ లో ఎయిర్ ఇండియా విమానాలన్నీ నిలిచిపోయాయి.ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు.  మే 1నుంచి ప్రయాణాలు రద్దు చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా వాపస్ ఇస్తామని అధికారులు తెలిపారు. అయితే ఏడు రోజుల ముందు టికెట్ బుక్ అయ్యి ఉన్న వారికే ఈ వెసులుబాటు అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం సాంకేతిక నిపుణులు ఎంటర్ అయ్యి ఎయిర్ ఇండియా సర్వర్ కు మరమ్మతులు చేస్తున్నారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం  దొరుకుతుందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులు మాత్రం నరకయాతన పడుతున్నారు.
    

Tags:    

Similar News