చాక్లెట్‌లో పురుగులు.. 50 ల‌క్ష‌ల ప‌రిహారం కోరిన వినియోగ‌దారుడు.. కోర్టు ఏమందంటే!

Update: 2022-05-28 02:30 GMT
దేశంలో వినియోగ దారుల హ‌క్కుల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెద్ద‌పీట వేస్తున్నాయి. వినియోగ‌దారులు లేక‌పోతే.. మార్కెట్ లేద‌ని భావిస్తున్న ప‌లు సంస్థ‌లు కూడా వారిని అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని కొన్ని సార్లు సంస్థ‌లు చేస్తున్న లోపాలు.. త‌ప్పులు కార‌ణంగా.. వినియోగ‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి వినియోగ‌దారుల కోర్టులు అండ‌గా ఉంటున్నాయి. ఆయా త‌ప్పుల‌పై విచార‌ణ చేసి.. వినియోగ‌దారుల‌కు న్యాయం చేకూరుస్తున్నాయి.

ఇలాంటి వినియోగ‌దారుల కేసుల్లో చిత్ర‌మైన కేసు ఒక‌టి క‌ర్ణాట‌క‌లో వెలుగు చూసింది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ చాక్లెట్ దిగ్గ‌జ సంస్థ క్యాడ్‌బ‌రీ సంస్థ నుంచి వ‌చ్చిన ఖ‌రీదైన(రూ.89)  చాక్లెట్‌ను కొనుగోలు చేసిన క‌స్ట‌మ‌ర్‌కు చుక్క‌లు క‌నిపించాయి. స‌ద‌రు చాక్లెట్‌ను విప్పి చూడ‌గా.. దానిలో పురుగులు క‌నిపించాయి. దీంతో ఒక్క‌సారిగా హ‌తాశుడైన స‌ద‌రు క‌స్ట‌మ‌ర్‌.. కేసు వేశారు. అయితే.. ఇది జ‌రిగింది 2016లో. కానీ.. తీర్పు మాత్రం తాజాగా వ‌చ్చింది. ఆ వివ‌రాలు ఆస‌క్తిగా ఉన్నాయి.

బెంగ‌ళూరులోని హెచ్ ఎస్ ఆర్ లే అవుట్‌లో ఉంటున్న ముఖేశ్ కుమార్ కెడియా అనే వ్య‌క్తి 2019 అక్టోబ‌రులో స్థానిక ఎంకే రిటైల్ సూప‌ర్ మార్కెట్‌లో క్యాడ్‌బ‌రీ ఫ్రూట్‌, న‌ట్ చాక్లెట్ల‌ను ఒక్కొక్కి రూ.89 చొప్పున రెండు కొన్నారు. అయితే.. ఇంటికెళ్లాక వాటిని విప్పి చూడ‌గా.. పురుగులు క‌నిపించాయి.

దీంతో క్యాడ్‌బ‌రీ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పాడు. దీంతో సిబ్బంది.. పురుగులున్న చాక్లెట్ల‌ను తిరిగి ఇవ్వాల‌ని సూచించారు. దీనికి నిరాక‌రించిన కెడియా.. పురుగుల‌తో కూడిన చాక్లెట్ల ఫొటోల‌ను వారికి పంపారు. అయితే.. దీనిపై క్యాడ్ బ‌రీ సంస్థ ఆశించిన విధంగా స్పందించ‌లేద‌నేది కెడియా వాద‌న‌.

దీంతో ఆయ‌న 2016, అక్టోబ‌రు 26న బెంగ‌ళూరులోని అర్బ‌న్ జిల్లా వినియోగ‌దారుల కోర్టు ను ఆశ్ర‌యించారు. క్యాడ్‌బ‌రీ సంస్థ మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాణ్య‌తా విభాగం అధిప‌తితో పాటు వీటిని బ‌ల్క్‌గా కొనుగోలు చేసి వినియోగ‌దారుల‌కు విక్ర‌యిస్తున్న రిటైల్ బ్రాంచ్‌పై ఫిర్యాదు చేశారు. వారి నిర్ల‌క్ష్యానికిగాను రూ.20 ల‌క్ష‌ల నుంచి 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌రిహారం చెల్లించేలా ఆదేశించాల‌ని కోరారు. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వినియోగ‌దారుల కోర్టు సుదీర్ఘ కాలం విచారించింది. చాక్లెట్ల‌లో పురుగులు ఉన్న‌ట్టు నిర్ధారించింది.

న్యాయం ద‌క్క‌లేదు!

అయితే.. ఇంత సుదీర్ఘ‌కాలం విచారించినా.. పిటిష‌న్ వేసిన కెడియాకు న్యాయం మాత్రం జ‌ర‌గ‌లేదు. ఎందుకంటే.. జిల్లా కోర్టుకు కేవ‌లం 5 ల‌క్ష‌ల లోపు ప‌రిహారం ఇప్పించే స్థాయి మాత్ర‌మే ఉంటుంద‌ని.. కాబ‌ట్టి ఈ కేసును రాష్ట్ర స్థాయి కోర్టులో వేసుకోవాల‌ని సూచించింది. దీంతో కెడియా.. దీనిపై రాష్ట్ర కోర్టుకు వెళ్లే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఆ రేళ్లే విచార‌ణ త‌ర్వాత వినియోగ‌దారుల కోర్టు ఈ తీర్పు చెప్ప‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News