రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ పై ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మురళీ మోహన్ గారు...వెంకన్న స్వామి తమ చౌదరి కులానికి చెందినవాడని అనడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. అన్ని కులాలవారు ఆదరిస్తేనే మీరు హీరో అయ్యారని, అన్ని కులాలవారు ఓటేస్తేనే మీరు ఎంపీ అయ్యారని, అన్ని కులాలవారు ఆశీర్వదిస్తేనే మీరు జయభేరి ఆర్ట్స్ నిర్మాణ సంస్థ పెట్టి పెద్దవారయ్యారని మురళీ మోహన్ ను ఉద్దేశించి చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను బాంబేలో ఓ గెస్ట్ హౌస్ లో ఉన్నానని, మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలను తన మిత్రుడు తనకు చెప్పడంతో షాక్ అయ్యానని అన్నారు. కలియుగ దైవం తిరుమల వెంకన్న స్వామిని...మురళీ మోహన్ గారు చౌదరి అంటున్నారని, దేవుడికి కులం ఆపాదించడం ఏమిటని తన మిత్రుడు ప్రశ్నించాడని అన్నారు. ఆ మాట వినగానే తాను సిగ్గుతో తల దించుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మురళీ మోహన్ గారంటే తనకు చాలా గౌరవం, ఇష్టం, అభిమానం అని చెప్పారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వయసులో మీకన్నా చాలా చిన్నవాడైన జగన్ మోహన్ రెడ్డి గారు ఏ కులాన్ని హర్ట్ చేయలేదని ఆయనను చూసి నేర్చుకోవాలని మురళీ మోహన్ ను ఉద్దేశించి అన్నారు.
గతంలో గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు వేదిక పై ఉన్న ఓ సభలో ఓ వ్యక్తి....బ్రహ్మ...కమ్మ అని వ్యాఖ్యలు చేశారని....చిరంజీవి గారిని...కాపు కులస్థులను విమర్శించారని....అన్నారు. ఆ వ్యాఖ్యలు చేస్తున్నపుడు టీడీపీ ఎమ్మెల్యేలు క్లాప్స్ కొట్టి నవ్వారని....కావాలంటే ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చూడొచ్చని చెప్పారు. మీరు ఆ కులంలో పుట్టినందుకు గర్వించవచ్చిని, ఆ కులాన్ని ప్రేమించడంలో తప్పులేదని, అసోసియేషన్లు పెట్టుకొని ఆ కులంలో వెనుకబడినవారి అభివృద్ధికి కృషి చేయొచ్చని అన్నారు. కానీ, ఇంకొక కులాన్ని తిట్టడమే కాకుండా బ్రహ్మ,వెంకటేశ్వర స్వామి కూడా కమ్మ కులం వారేనని ప్రచారం చేసే సంస్కృతిని మురళీ మోహన్ వంటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడడంతో తనకెలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు. మీకెమన్నా ఆరోగ్య సమస్యలుంటే ఆసుపత్రిలో చూపించుకోవాలని, దయచేసి ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కులం పేరుతో విడగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. జగన్ ను చూసి నేర్చుకోవాలని, అసలు ఆయన ఏ కులాన్ని హర్ట్ చేయలేదని చిరంజీవి - పవన్ కల్యాణ్....ను హర్ట్ చేయలేదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, ఈ తరహా వాతావరణం విపరీత పరిణామాలకు దారితీస్తుందని...ఇంతకన్నా ఏం చెప్పాలో కూడా తనకు అర్థం కావడం లేదని....దయచేసి కరెక్ట్ చేసుకోండని మురళీ మోహన్ కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చిన్ని కృష్ణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.