రాజధానితో రాంగ్ రాజకీయం...బూమరాంగ్...?

Update: 2022-03-30 02:30 GMT
ఏపీకి రాజధాని ఏది అంటే అమరావతి అనే చెప్పాలి. కానీ వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులు అంటున్నారు. ఈ విషయం మీద అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సుదీర్ఘమైన ప్రసంగం చేస్తూ తమ విధానం ఎక్కడా మారలేదని చెప్పుకున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా పదే పదే మూడు రాజధానులు అంటున్నారు. నిజానికి మూడు సాకారం అవుతుందా,  దానికి సంబంధించి వైసీపీ వద్ద ఉన్న రోడ్  మ్యాప్ ఏంటి అంటే జవాబు లేదనే అంటున్నారు.

మరో వైపు చూస్తే మూడు రాజధానుల అంశాన్ని వచ్చే ఎన్నికల దాకా అలాగే  నాన్చి ప్రజలలో అతి ముఖ్య అంశంగా పెట్టి తీర్పు కోరాలని వైసీపీ వ్యూహంగా ఉంది అంటున్నారు. కానీ అలా చేస్తే దాని వల్ల రాజకీయంగా వైసీపీకి మేలు కంటే చేటే ఎక్కువగా ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో మూడు రాజధానుల సమస్యను అలా రగిల్చడం వల్ల చివరికి అది బూమరాంగ్ అవుతుందన్న మాటా వినిపిస్తోంది.

ఏపీకి రాజధాని లేదు అన్నది జనాల బాధ. అయిదు కోట్ల మంది జనాలు కూడా రాజధాని కావాలని, తమ స్టేట్ కి ఒక అడ్రస్ ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళకు దగ్గర అవుతోంది. అమరావతి రాజధాని విషయంలో ఈ రోజుకీ చేసింది పెద్దగా లేదు. అలాగని మూడు రాజధానుల విషయంలో అడుగు ముందుకు వేయడానికి కోర్టు తీర్పు అడ్డుగా ఉంది.

చేతిలో ఇంకా రెండేళ్ళు మాత్రమే సమయం ఉంది. ఈ రెండేళ్ల లోగా వైసీప  పెద్దలు రాజధాని విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని అంటున్నారు. అంటే మూడు రాజధానులే తమ విధానం అయినపుడు దాని మీద హై కోర్టులో తీర్పు మీద రివ్యూకు వెళ్లాలి. తాము అసెంబ్లీలో చెప్పిన వాదననే కోర్టుకు వినిపించాలి. అక్కడ కాకుంటే సుప్రీం కోర్టుకు వెళ్ళి హై కోర్టు తీర్పుని సవాల్ చేయాలి.

అక్కడ తీర్పు లేట్ అవుతుంది అనుకుంటే హై కోర్టు తీర్పు మీద స్టే అయినా అడగాలి. ఇవన్నీ న్యాయపరంగా చేయాల్సిన పనులు. అలా కాకుండా మూడు రాజధానులు ముద్దు అంటూ మాటల వరకే చెబుతూ కూర్చుంటే పుణ్య కాలం గడచిపోతుంది. జనాల్లో కూడా అసహనం చెలరేగుతుంది. అది కాస్తా ఎన్నికల వేళకు వ్యతిరేకతగా మారితే మాత్రం కష్టమే అంటున్నారు.

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ చేతులలో సర్వనాశనమైన ఏపీని మొదటి నుంచి పూర్తిగా నిర్మించాలని అంటున్నారు. ఆ బాధ్యతను నెరవేర్చాలీ అంటే టీడీపీ అధికారంలోకి రావాలని కూడా ఆయన జనాలను కోరుతున్నారు. మూడు రాజధానులు మూడు ప్రాంతాలలో సెంటిమెంట్లు ఉండవచ్చు కానీ అది అమలు కాకపోతే జనాలు ఒక రాజధాని అయినా ఏపీకి ఉండాలని చాలా గట్టిగానే  కోరుకుంటారు. చివరికి వారు ఆ విధంగా డిసైడ్ అయితే రాజకీయంగా వైసీపీని నష్టమే వాటిల్లుతుంది అంటున్నారు.

మొత్తానికి మూడు రాజధానుల విషయంలో వైసీపీ చేతలకు దిగితేనే మేలు అంటున్నారు. ఇక సుప్రీం కోర్టుకు వెళ్ళినా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందో రాదో అన్న బెంగ కనుక ఉంటే అమరావతిని అయినా అభివృద్ధి చేయాలి. అలాగే తాము కోరుకుంటున్నట్లుగా విశాఖ కర్నూల్ లలో ఎంతో కొంత అభివృద్ధి  అయినా చూపించాలి. ఏమీ చేయకుండా త్రీ క్యాపిటల్స్ అన్న ట్రంప్ కార్డ్ తోనే ముందుకు వెళ్తే ఇబ్బంది తప్పదనే వాదన ఉంది. మొత్తానికి చూస్తే రాజధానితో గేమ్స్ ఆడితే డేంజరే అన్న సంకేతాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి వైసీపీ పెద్దల మనసులో ఏముందో.
Tags:    

Similar News