పీకే సార్‌!.. టైమున్నా వెన‌క‌డుగేనా?

Update: 2019-02-11 13:36 GMT
కొత్త రాష్ట్రం తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ నానాటికీ పుంజుకుంటుండ‌గా... ఏళ్ల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ నానాటికీ బ‌క్క‌చిక్కిపోతున్నాయి. ఇలాంటి త‌రుణంలో కొత్త పార్టీల గురించిన ముచ్చ‌టే లేద‌న్న‌ట్లుగా అక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితులు మారిపోయాయి. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఏపీలో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు స‌ర్వ‌స‌న్నాహాలు చేసుకుంటున్న ప‌వ‌న్‌... తెలంగాణ‌లో పోటీ విష‌యంలో మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు వెన‌క‌డుగు వేస్తూనే ఉన్నారని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ‌లో 17 పార్ల‌మెంటు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయాల్సి ఉంది. అయితే ఆయ‌న మాత్రం తెలంగాణ‌లో పోటీకి మాత్రం అంత‌గా ఉత్సాహం చూపుతున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు.

మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైనాన్ని గుర్తు చేసిన ప‌వ‌న్‌.. ఊహించ‌ని విధంగా ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని, ఈ నేప‌థ్యంలో స‌రైన స‌మ‌యం లేనందున ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించేశారు. ఎన్నిక‌ల‌కు చాలా ముందుగానే ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేసి బ‌య‌ట‌ప‌డిపోయారు. అయితే ఆ సంద‌ర్భంగానే వ‌చ్చే లోక్ స‌భ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ‌లోని అన్ని పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేస్తామ‌ని, ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌కు చెందిన పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళ‌న‌కు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా ఆయ‌న చెప్పేశారు. ఇప్పుడు ప‌వ‌న్ చెప్పిన స‌మ‌యం రానే వ‌చ్చింది. మ‌రో రెండు నెల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోని అన్ని సీట్ల‌లోనూ జ‌న‌సేన పోటీ చేయాల్సి ఉంది. ఆ మేర‌కు అక్క‌డి పార్టీ శ్రేణులు ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న కోసం ఆసక్తిగా ఎదురు చూడ‌ట‌మే కాకుండా... పోటీకి స‌న్నాహాలు కూడా చేసుకుంటున్నారు.

అయితే ఇప్ప‌టిదాకా తెలంగాణ‌లోని ఓ ఆరు పార్లమెంటు నియోజ‌క‌వర్గాల‌కు క‌మిటీల‌ను ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. త్వ‌ర‌లోనే వాటికి అద‌నంగా ఒక‌టో, రెండో స్థానాల‌కు మాత్ర‌మే క‌మిటీల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టిదాకా ప‌వ‌న్ క‌మిటీలు ప్ర‌క‌టించిన లోక్ స‌భ స్థానాల విష‌యానికి వ‌స్తే.. సికింద్రాబాద్‌, మ‌ల్కాజిగిరి, ఖ‌మ్మం, మెద‌క్ న‌ల్గొండ‌, భువ‌న‌గిరిల‌కు ఆయ‌న క‌మిటీల‌ను ప్ర‌క‌టించారు. వీటికి అద‌నంగా మ‌రో ఒక‌టి గానీ, రెండు గానీ కొత్త క‌మిటీలు ప్ర‌క‌టించే అవ‌కాశాలు మాత్ర‌మే ఉన్నాయని స‌మాచారం. అంటే మొత్తంగా ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పార్టీ కేవ‌లం 7 నుంచి 8 స్థానాల్లో మాత్ర‌మే పోటీకి సిద్ధంగా ఉన్న‌ట్లు లెక్క‌. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం లేద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఇప్పుడు పోటీకి స‌రిప‌డ స‌మ‌యం ఉన్నా కూడా తెలంగాణ‌లో పోటీకి ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం చూస్తుంటే.. తెలంగాణ‌లో పోటీకి ప‌వ‌న్‌కు ధైర్యం లేద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.


Tags:    

Similar News