ప్రపంచం హాహాకారాలు చేస్తుంటే..అక్కడ మాత్రం స్వేచ్ఛ!

Update: 2020-04-09 23:30 GMT
మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించిన ఘనత చైనాలోని వూహాన్ మహానగరానికే చెల్లుతుంది. ప్రపంచం మొత్తం ఎవరి ప్రపంచంలో వారున్న వేళ.. మాయదారి కరోనా పుణ్యమా అని.. ఇప్పుడు దాని ధ్యాస తప్పించి మరింకేమీ పట్టని దుస్థితి. ప్రాణాలు ఉంటాయో ఉండవోనన్న ఆందోళన.. జీవితం మొత్తం ఇప్పుడు లాక్ డౌన్ గా మారిపోయింది. దేశాలకు దేశాలు ఇప్పుడు పరిమితుల మధ్య బతకాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే.. ఇంతటి సంక్లిష్ట పరిస్థితిని కలలో కూడా ఊహించని పరిస్థితి.

క్యాలెండర్లో రోజు గడుస్తుందంటే చాలు.. ఎన్ని ప్రాణాలు పోతాయో.. మరెంతమంది కరోనా బారిన పడతారో అర్థం కాని పరిస్థితి. యావత్ ప్రపంచం మొత్తం కరోనా భయాందోళనల్లో మునిగిన వేళ.. ఈ వైరస్ కు పుట్టినిల్లు అయిన వూహాన్ లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రజలు ఇప్పుడెలా ఉన్నారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే అసూయతో రగిలిపోవాల్సిందే.

ఎందుకంటే.. 76 రోజుల లాక్ డౌన్ ను ముగించుకొని ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయివుల్ని పీలుస్తుందా దేశం. రెండున్నర నెలల లాక్ డౌన్ బంధీఖానా నుంచి బయటకు వస్తున్న ఆ నగర ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. కరోనా భయాందోళనలు తగ్గిపోవటం.. ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేయటంతో నగరంలో కదలిక మొదలైంది. ఎవరి పనుల్లో వారు బిజీ అవుతున్నారు.

ఆఫీసులు.. ఫ్యాక్టరీలు ఎప్పటిలా యథావిధిగా పని చేయటం షురూ అయింది. ఒకప్పుడు శశ్మాన నిశ్శబ్దంగా మారిన వూహాన్ నగరం ఇప్పుడు కొత్త కళతో వెలిగిపోతుంది. నిర్మానుష్యంగా మారిన వీధులు.. శోక సంద్రాన్ని తలపించేలా మారిన నగరం ఇప్పుడు అందుకు భిన్నంగా సందడిగా మారింది. ఎడారుల మాదిరి కనిపించిన వీధులు ఇప్పుడు జనంతో కళకళలాడుతున్నాయి. పెద్ద యుద్ధం చేసిన తర్వాత ఉండే భావోద్వేగం ఇప్పుడక్కడి ప్రజల్లో ఉంది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కంటడి పెట్టుకునే సీన్లు కనిపించాయి. కరోనాను జయించామన్న కేకలు పెట్టారు. షాపుల్ని.. షాపింగ్ మాల్స్ ను ప్రత్యేకంగా అలకంరిస్తున్నారు. ఇక.. వూహాన్ విమానాశ్రయంలో బుధవారం దిగిన తొలి విమానానికి జల ఫిరంగులతో స్వాగతం పలికారు. ఇదంతా చూస్తున్నప్పుడు.. వూహాన్ మహానగరం మాదిరి తాము ఎప్పటికి అలాంటి పరిస్థితుల్లోకి వెళతామన్న ఆత్రుత ప్రపంచ దేశ ప్రజలకు కలగటం ఖాయం.
Tags:    

Similar News