ఇంగ్లండ్ కు రిష‌బ్‌!... శిఖ‌ర్ ప్లేస్‌ లో పంత్‌!

Update: 2019-06-12 10:34 GMT
ఐసీపీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో తొలి రెండు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి మాంచి స్పీడు మీదున్న టీమిండియాకు భారీ షాకే త‌గిలింది. జ‌ట్టులో స్టార్ బ్యాట్స్ మ‌న్ గానే కాకుండా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ గాయం కార‌ణంగా రెండు వారాల పాటు విశ్రాంతిలోకి వెళ్ల‌క తప్ప‌లేదు. రెండు వారాల త‌ర్వాత కూడా ధావ‌న్ అందుబాటులోకి వ‌స్తాడా, రాడా అన్న విష‌యం కూడా ఖచ్చితంగా చెప్పే ప‌రిస్థితి లేదు. అస‌లే వ‌ర‌ల్డ్ క్రికెట్ లోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన టోర్న‌మెంట్ వన్డే వ‌రల్డ్ క‌ప్‌. ఇలాంటి కీల‌క టోర్నీలో ధావ‌న్ లాంటి ఆట‌గాడు ఉన్న‌ట్టుండి జ‌ట్టుకు దూర‌మైతే... ప‌రిస్థితి ఏమిటి?

జ‌ట్టుతో పాటు జ‌ట్టు యాజ‌మానిగా ఉన్న బీసీసీఐకి, కోహ్లీ జ‌ట్టు క‌ప్ తెస్తుంద‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్న వంద కోట్ల మందికి పైగా భార‌తీయులకు కూడా షాక్ త‌గిలిన‌ట్టే క‌దా. అందుకే బీసీసీఐ చాలా వేగంగానే క‌దిలిందని చెప్పాలి. ధావ‌న్ స్థానంలోకి కేఎల్ రాహుల్ ను ఓపెన‌ర్‌ గా మార్చేసి.... నాలుగో స్థానంలోకి రిష‌బ్ పంత్ ను ఎంపిక చేసే దిశ‌గా సాగుతోంది. శిఖ‌ర్ ధావ‌న్ గాయాన్ని ప‌రిశీలించిన వైద్య నిపుణులు ఇచ్చిన నివేదిక‌తోనే బీసీసీఐ ఆగ‌మేఘాల మీద రిష‌బ్ ను లండ‌న్ పిలిపించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. అయితే ఈ విష‌యాన్ని ఎలా ప‌సిగ‌ట్టాడో గానీ.. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మ‌న్ కెవిన్ పీట‌ర్స‌న్ బీసీపీఐ కంటే ముందే.. పంత్ ఎంపిక త‌ప్ప‌ద‌న్న కోణంలో ఆసక్తిక‌ర కామెంట్లు చేశాడు.

జ‌ట్టులో తొలి విడ‌త‌లోనే స్థానం ద‌క్కేది గానీ... సీనియ‌ర్ ఆట‌గాడు దినేశ్ కార్తీక్ ను దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ పంత్ ను ఎంపిక చేయాల‌ని మ‌న‌సులో ఉన్నా... చేయ‌లేక‌పోయింది. అయితే ఇప్పుడు ధావ‌న్ లాంటి బ్యాట్స్ మ‌న్ గాయ‌ప‌డితే... పంత్ త‌ప్పించి మ‌రొక‌రి పేరును ప‌రిశీలించే ప‌రిస్థితిలో బీసీసీఐ లేన‌ట్లుగా స‌మాచారం. మొత్తంగా ఇప్ప‌టికే త‌న స‌త్తా ఏమిటో నిరూపించుకున్న పంత్ ఇప్పుడు ఊహించ‌ని రీతిలో వ‌చ్చిన అవ‌కాశాన్ని ఏమేర స‌ద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News