అంత్యక్రియలపై డేగ కన్ను అవసరమే

Update: 2015-08-01 05:00 GMT
పెద్ద పెద్ద విషయాల్ని చాలా చిన్న చిన్నగా ఆలోచించటం కారణంగా సంక్లిష్టత తగ్గి.. అనవసరమైన వివాదాలు ముసరకుండా ఉంటాయి. ఏదైనా చిన్న నేరం చేసినట్లుగా ఆరోపణలు వచ్చి.. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందితే.. వారేం చేస్తారు? మొదట అతగాడి గురించి ఆరా తీస్తారు. ఒకవేళ అతగాడి వ్యవహారం తేడా ఉంటే అతన్ని పట్టుకొని స్టేషన్ కు తీసుకెళతారు.

ఒకవేళ అతగాడు కానీ.. ఆచూకీ లేకుండా పోతే.. వెంటనే అతగాడి కుటుంబ సభ్యుల్ని.. మిత్రుల్ని స్టేషన్ కు తీసుకొస్తారు. అతడి గురించి విచారించటం.. సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పత్తా లేకుండా పోవటంలో వారి పాత్ర ఏదీ లేదని తేల్చుకున్న తర్వాత విడిచిపెడతారు. కానీ.. వారి మీద మాత్రం డేగకన్ను వేయటం మానరు.

చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారి విషయంలో పోలీసులు ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ముంబయి బాంబు పేలుళ్ల లాంటి భారీ ఘటనలో కీలక దోషిగా నిరూపితమై.. అతనికి ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత.. అతని అంతిమ యాత్ర కోసం భారీగా జనం పోగుకావటం దేనికి నిదర్శనం.

257 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనలో నేరారోపణ రుజువై.. 22 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఎన్నోసార్లు మరణశిక్ష నుంచి తప్పించుకోవటం కోసం ప్రయత్నాలు చేసి.. చేసి చివరకు ఉరి కంబం మీదకు ఎక్కిన వ్యక్తికి అంత ఆదరణ ఏమిటి? ఒక మంచి వ్యక్తికి జనాదరణ ఉండటం అర్థం చేసుకోవచ్చు. కానీ.. తీవ్రవాద కార్యకలాపాలలో కీలకపాత్ర పోషించి.. వందలాది మంది మృతికి కారణమైన వ్యక్తి అంతిమయాత్రకు భారీగా జనం పోగుకావటం దేనికి నిదర్శనం..?

దీనికి తోడు.. మత రాజకీయాలతో యాకూబ్ మెమన్ ఉరిపై రాజకీయ పార్టీలు తలో విధంగా స్పందిస్తూ.. అతని మరణశిక్షపై అసంతృప్తితో ఉన్న వారికి మరింత మద్ధతు పలికేలా వ్యవహరించటం వారిపై ప్రభావాన్ని కచ్ఛితంగా చూపిస్తుంది. తాము ఏదైతే ఫీలయ్యామో.. అలాంటి భావనల్నే రాజకీయ పార్టీలు కూడా వాదిస్తున్నయంటే.. తాము అనుకున్న దాన్లో తప్పు లేనట్లుగానే వారు భావిస్తారు. అదే జరిగితే ఇదో ప్రమాదకర సంకేతంగా అనుకోవాలి.

వందలాది ప్రాణాలు తీసిన వ్యక్తి ప్రాణాన్ని కాపాడటం కోసం ఒక బాలీవుడ్ హీరో మొదలు.. రాజకీయ పార్టీల వరకు వాదనలు వినిపించటం చూసినప్పుడు.. ఒక దోషికి ఇంత మద్ధతా అనిపించక మానదు. ఇలాంటివన్నీ కూడా యాకూబ్ మెమన్ ను హీరోగా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అమాయకుడా.. మాయకుడా అన్న విషయాన్ని పక్కన పెట్టేసి.. కరుడుగట్టిన నేరస్తుల (మెమన్ కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు.. కేసులు ఉన్నాయి) కుటుంబానికి చెందిన వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేస్తే అంత భారీగా హాజరు కావటాన్ని ఏ కోణంలో చూడాలి? ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సమయంలో మూడో కన్ను వేయాల్సిన అవసరం ఉంది. మెమన్ కు సానుభూతి చూపించే వారు.. అతని మరణాన్ని మరో కోణంలో చూసే వారిపై డేగకన్ను వేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. మరో దారుణానికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News