కృష్ణుడుకు వద్దని దివ్యకు బాధ్యతలు ఇవ్వటమా? ఇప్పుడేం జరుగుతుంది?

Update: 2023-02-05 12:00 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న  ఒక నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. తుని అసెంబ్లీ నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలస్యం చేయటంతో పాటు.. రోజుల తరబడి నానబెడతారన్న పేరున్న బాబుకు బదులుగా.. తాజాగా ఆయన నిర్ణయాన్ని తీసేసుకున్నారు. తుని నియోజకవర్గ పార్టీ బాధ్యతల్ని మొన్నటివరకు యనమల రామక్రిష్ణుడు సోదరుడు కృష్ణుడు చూసేవారు.

తాజాగా ఆయనకు బదులుగా మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు కుమార్తె యనమల దివ్యకు అప్పజెబుతూ నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు రావటం తెలిసిందే. తుని సీటును ఆశిస్తున్న కృష్ణుడుకు కాకుండా యనమల కుమార్తెకు ఇచ్చేందుకు చంద్రబాబు సానుకూలంగా ఉన్నారన్న విషయం తెలిసిందే. దీనిపై అతను సీరియస్ గా ఉన్నారు.

తాను కష్టపడితే.. తన సోదరుడి కుమార్తెకు సీటు ఎలా ఇస్తారన్నది ఆయన ప్రశ్న. తన మనసులోని ఆగ్రహాన్ని మాటల రూపంలో బయటకు పెట్టటం.. దానికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ కావటం తెలిసిందే. తనను అభిమానించే వారిని కూడగట్టిన కృష్ణుడు.. తన సోదరుడి వద్దకు వెళ్లి.. సీటును ఎలా ఇస్తారన్న విషయాన్ని నిలదీయాలని కోరటం అందులో ఉంది. ఊరికి నలభై మంది చొప్పున వెళ్లి యనమల రామక్రిష్ణుడు ప్రశ్నిస్తే బాగుంటుందని.. దివ్య ఇంట్లోనే ఉంటుందని.. అలాంటప్పుడు ఎవరు చూసుకుంటారన్న ప్రశ్నను సంధించాల్సిందిగా ఆయన కోరారు.

యాదవ సంఘంలో ముప్ఫై వేల ఓట్లు ఉన్నాయని.. తాను లేకపోతే ఎవరూ చూడరన్న కృష్ణుడు వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అయితే..ఈ తరహా మాటల్ని లెక్కలోకి తీసుకోకుండా తాను అప్పజెప్పాల్సిన బాధ్యతల్ని దివ్యకు అప్పగించేస్తూ చంద్రబాబు అధికారికంగా నిర్ణయం తీసుకోవటంతో.. తునిలో తమ్ముళ్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News