య‌న‌మ‌ల‌, రావెల‌....కాస్త త‌గ్గాలేమో..

Update: 2015-09-01 06:21 GMT
తెలుగుదేశానికి చెందిన మంత్రులు య‌న‌మల రామ‌కృష్ణుడు, రావెల కిశోర్‌ బాబు దూకుడు స్పంద‌న ఈ మ‌ధ్య కాలంలో వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతోంది. రాజ‌ధాని నిర్మాణానికి భూములు సేక‌రించే అంశ‌మై స్పందించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై ఈ ఇద్ద‌రు మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయాల్లో హీట్ పుట్టించిన సంగ‌తి తెలిసిందే. ఏపీ సీఎం చంద్ర‌బాబు లైన్ లోకి దిగితే కానీ ప‌రిష్కారం కాని స్థాయికి ఆ స‌మ‌స్య చేరిపోయింది.

ఈ ఇద్ద‌రు మంత్రులు తాజాగా మ‌రోమారు త‌మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో చ‌ర్చ‌కు దారితీశారు. అయితే ఈ సారి అసెంబ్లీ వేదిక‌గా మంత్రులు ఈ విధంగా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. అవినీతి పై స్పందిస్తూ ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు అవినీతి జరగనిది ఎక్కడ? అంటూ అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంచినీటి ఎద్దడి నివారణ కోసం గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా చేస్తున్న నీటి సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందంటూ కొందరు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రమే లబ్ధి పొందుతున్నారని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగం కలగడం లేదని వారు సభలో ప్రస్తావించారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు, కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే లు సభలో డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి యనమల అసలు అవినీతి జరగనిది ఎక్కడ అంటూ వ్యాఖ్యానించారు. అన్ని చోట్లా జరుగుతున్న విధంగానే మంచినీటి సరఫరాలో కూడా జరుగుతోందంటూ చెప్పారు. మంచినీటి కోసం 13వ ఆర్థిక సంఘం కాలంలో పంచాయతీరాజ్ సంస్థల్లో రూ. 214 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిధులు మాత్రం ఇక నుంచి నేరుగా పంచాయతీలకే పంపిస్తామని వివరించారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విషయంలో ఏపీ మంత్రి రావెల కిశోర్-బాబు శాసనమండలిలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్-మెంట్ విషయంలో ఆయన ‘గాడిదలు, గుర్రాలను ఒకే గాటన కట్టలేం’ అంటూ చేసిన వ్యాఖ్యలతో స‌భ‌ అట్టుడికింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వారి కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ క‌ల్పించాల‌ని వైసీపీ సభ్యులు డిమాండ్ చేయడంతో రావెల‌ పై విధంగా వ్యాఖ్యానించారు. పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో ఆదాయ పరిమితి విధించామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గాడిదలు, గుర్రాలతో పోల్చిన మంత్రి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పోడియాన్ని ముట్టడించారు. అనంతరం తన వ్యాఖ్యలను రావెల ఉపసంహరించుకున్నారు.
Tags:    

Similar News