ట్యాప్ చేసి బుక్ అయ్యారా..?

Update: 2015-06-09 13:27 GMT
కొన్నేళ్ల కిందట రాంగోపాల్ వ‌ర్మ సినిమా వ‌చ్చింది. ఆ సినిమాలో మాఫియా ముఠాలు అధిప‌త్య‌పోరు కోసం పోట్లాడుకుంటాయి. వారి మ‌ధ్య రాజీ చేసేందుకు.. ఒక‌రితో ఒక‌రు కొట్లాడుకోవ‌ద్దంటూ మ‌ధ్య‌వ‌ర్తి తెగ ప్ర‌య‌త్నాలు చేస్తాడు. అయిన‌ప్ప‌టికీ వారు ఆప‌రు. ఆ సంద‌ర్భంగా ఆ మ‌ధ్య‌వ‌ర్తి అయిన లాయ‌ర్ ఒక మాట చెబుతాడు. మొద‌లు పెట్టొద్దు.. ఒక‌వేళ మొద‌లుపెడితే అది అంద‌రిని దెబ్బ తీస్తుంది. వ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తాడు.చివ‌ర‌కు రెండు వ‌ర్గాలు దెబ్బ తింటాయి.

ఈ సినిమాకు.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు పూర్తి సంబంధం ఉంద‌ని చెప్ప‌లేం కానీ.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా సాగుతున్న ప‌రిణామాలు చూసిన‌ప్పుడు.. ఆ సినిమా రేఖామాత్రంగా గుర్తుకు వ‌స్తుంది. రాజ‌కీయాలు స్వ‌చ్ఛ‌మైన‌వి.. నీతివంత‌మైన‌వి అని చెబితే అంత‌కు మించిన జోక్ మ‌రొక‌టి ఉండ‌దు. వ‌ర్తమానంలోసాగుతున్న రాజ‌కీయాల్లో ఎవ‌రూ సుద్ద‌పూస‌లు కారు. కాక‌పోతే..ఎవ‌రి అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా వారు వ్య‌వ‌హ‌రించ‌టం మామూలే.
అయితే.. తెలంగాణ‌లో త‌ల‌నొప్పిగా మారిన తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేందుకు.. మ‌రి ముఖ్యంగా త‌మ‌ను ఊరికే గోల పెట్టేసే రేవంత్ రెడ్డికి భారీ ఝుల‌క్ ఇచ్చేందుకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ అధికార‌ప‌క్షం.. ఓటుకు నోటు వ్య‌వ‌హారాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. ప‌క్కాగా స్కెచ్ వేసి.. అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది.

ర‌చ్చ‌ను ఇంత‌టితో వ‌దిలేస్తే బాగుండేదేమో. ఎందుకంటే.. కెమేరాల సాక్షిగా దొరికిపోవ‌టంతో టీటీడీపీ నేత‌ల గొంతుల్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన ప‌రిస్థితి. క‌క్కాలేక మింగాలేక కిందామీదా ప‌డుతున్న వారిని.. అలానే ఉండ‌నిస్తే వ్య‌వ‌హారం మ‌రోలా ఉండేదేమో. కానీ.. రేవంత్ య‌వ్వారంలో విప‌రీత‌మైన కిక్కు రావ‌టంతో.. తెలంగాణ అధికార‌ప‌క్షం మ‌రింత ఉత్సాహంగా త‌మ ద‌గ్గ‌రున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు ఫోన్ టేప్‌ను త‌మ మీడియా సంస్థ అయిన టీ న్యూస్ ఛాన‌ల్ లో టెలికాస్ట్ చేసేశారు.

ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అయింది. బాబు గొంతుతో ఉన్న సీడీ టెలికాస్ట్ చేసిన వెంట‌నే షాక్ తిన్న టీడీపీ.. ఆవెంట‌నే త‌న బుర్ర‌కు ప‌దును పెట్టి.. ఎదురుదాడిని షురూ చేసింది. ఇందులో భాగంగా త‌మ సీఎం ఫోన్ ని ట్యాప్ చేస్తారా? అని. మొదట మామూలు విమ‌ర్శ‌లుగా తీసుకున్న‌ప్ప‌టికీ స‌మ‌యం గ‌డిచే కొద్దీ.. తాడులా క‌నిపించిన విమ‌ర్శ‌లు.. పాములుగా మారిన పరిస్థితి. ఆదివారం రాత్రికి.. సోమ‌వారం సాయంత్రానికి సీన్ ఎంత‌లా మారిపోయింద‌న‌టానికి ఇదే నిద‌ర్శ‌నం.

సోమ‌వారం రాత్రి నుంచి తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు త‌మ‌కు ఏపీ సీఎం ఫోన్ ని ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం లేదంటూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ముగిసిన ఏపీ క్యాబినెట్ అనంత‌రం మంత్రి య‌న‌మ‌ల మాట్లాడుతూ.. త‌మకు చెందిన 120 ఫోన్ల‌ను టీ స‌ర్కారు ట్యాప్ చేసిన‌ట్లుగా ఆధారాలు ఉన్న‌ట్లు తేల్చి మ‌రో బాంబు పేల్చారు. దీంతో.. టేపుల‌తో బుక్ చేయాల‌ని భావించిన తెలంగాణ అధికార‌ప‌క్షానికి.. తాజా ట్యాపింగ్ వ్య‌వ‌హారం మెడ‌కు చుట్టుకునేలా క‌నిపిస్తోంది. త‌మ ఫోన్లు ట్యాప్ అయిన విష‌యాన్ని మంత్రివ‌ర్గానికి ఏపీ రాష్ట్ర డీజీపీ చెప్పిన‌ట్లుగా య‌న‌మ‌ల పేర్కొన్నారు. ఇక‌.. ఆధారాలు.. సాక్ష్యాలు.. కేసులు.. నోటీసులు లాంటి హ‌డావుడి ఏపీలోనూ మొద‌ల‌వుతుంద‌న్న‌మాట‌.
Tags:    

Similar News